తొలి బంతి ఎదుర్కోవడానికి సచిన్ భయపడతాడు: గంగూలీ

by  |
తొలి బంతి ఎదుర్కోవడానికి సచిన్ భయపడతాడు: గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా దిగినప్పుడు ఎప్పుడూ నాన్ స్ట్రైకింగ్ వైపే ఉంటాడని, ఇన్నింగ్స్ తొలి బంతిని ఎదుర్కోవడానికి భయపడతాడని మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. మయాంక్ అగర్వాల్‌తో ట్విట్టర్ వేదికగా జరిగిన లైవ్ ఛాట్‌లో పలు విషయాలను వెల్లడించాడు. తొలి బంతిని సచిన్ ఎదుర్కోకపోవడానికి ఏదైనా కారణం ఉందా అని దాదాని ప్రశ్నించాడు. దీనికి గంగూలీ స్పందిస్తూ ‘సచిన్ ఎప్పుడూ స్ట్రైకింగ్ తీసుకోవడానికి ఇష్ట పడేవాడు కాదు. తొలి బంతిని ఎదుర్కోమని నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ, అతడు వద్దని అనేవాడు. ఫామ్‌లో ఉన్నా, లేకున్నా తనపై ఒత్తిడి ఉండకూడదనే నాన్-స్ట్రైకింగ్‌లో ఉండటానికే సచిన్ ఇష్టపడేవాడు. అయితే, కొన్నిసార్లు సచిన్ కంటే వేగంగా మైదానంలోనికి నడుచుకుంటూ వెళ్లి నాన్-స్ట్రైకింగ్ ఎండ్ వైపు నిలబడే వాడిని. అప్పటికే టీవీల్లో నేను నాన్ స్ట్రైకర్‌గా ప్రసారం అయిపోతూ ఉండటంతో చేసేదేం లేక సచిన్ స్ట్రైక్ తీసుకునేవాడు’ అని చెప్పాడు. సచిన్, గంగూలీ ఓపెనింగ్ ధ్వయం భారత జట్టుకు చిరస్మరణీయ విజయాలందించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే 9వ విజయవంతమైన జోడీగా గుర్తింపుపొందింది. 71 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ ప్రారంభించిన సచిన్, దాదా జోడీ 61.36 సగటుతో 4173 పరుగులు చేసింది. ఇందులో 12 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలు ఉన్నాయి.

Next Story

Most Viewed