పల్లె పార్కుల ఏర్పాటుపై నిర్లక్ష్యం

by  |
పల్లె పార్కుల ఏర్పాటుపై నిర్లక్ష్యం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: పల్లె ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో ఉమ్మడి జిల్లాలో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నుంచి నిధులను కేటాయించింది. అర ఎకరం నుంచి ఎకరానికి పైగా స్థలంలో వీటిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.2.50 లక్షల నుంచి రూ.6లక్షల వరకు నిధులు వెచ్చిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి, అందులో అన్ని రకాల చెట్లు, పూల, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. వీటిలో వాకింగ్ ట్రాక్​తోపాటు పిల్లలు ఆడుకునేందుకు వివిధ రకాల ఆట వస్తువులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ ఫెన్సింగ్​తోపాటు లైటింగ్ కూడా పెట్టాలి. వాకింగ్ చేశాక అలసిపోతే.. కూర్చునేందుకు సిమెంట్​బల్లలు ఏర్పాటు చేస్తున్నారు. నగరాలకు ఏ మాత్రం తీసిపోకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో వీటిని పూర్తి చేయగా.. పల్లె ప్రజలకు ఉపయోగకరంగా మారాయి. మరికొన్ని పల్లెల్లో అసంపూర్తిగా వదిలేయగా.. కాగితాల్లో మాత్రం పూర్తయినట్లు అధికారులు లెక్కలు చూపారనే విమర్శలు ఉన్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1510 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటికి అనుబంధంగా గ్రామాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. దీంతో మొత్తం 3,408 గ్రామ పంచాయతీలు, గ్రామాలుండగా.. అన్ని చోట్ల పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3,362 గ్రామాల్లో భూములు గుర్తించి.. విలేజ్ పార్కులు ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటి వరకు 3,318 గ్రామాల్లో మాత్రమే పనులు గ్రౌండింగ్ చేశారు. చాలా గ్రామాల్లో స్థానిక సర్పంచులు, గ్రామ కార్యదర్శుల చిత్తశుద్ధితో విలేజ్ పార్కులు కాస్తా నందనవనంగా మారాయి. పల్లె ప్రజలకు ఎంతో ఆహ్లాదం పంచుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా, అస్తవ్యస్తంగా మారాయి. చాలా చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడందో చెరువు శిఖం భూముల్లోనూ ఏర్పాటు చేశారు. చెరువులో నీరు నిండుగా ఉన్నప్పుడు నీటి తడి ఉంటోంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ విలేజ్ పార్కులు పూర్తికాకపోగా.. అస్తవ్యస్తంగా మారాయి. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోగా.. మండల, జిల్లా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదనే ఆరోపణలున్నాయి. అధికార పార్టీ అధినాయకుల అండ పుష్కలంగా ఉండడంతో చేసేవారు చేయరు.. చూసే వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఏల్వి గ్రామంలోని విలేజ్ పార్క్.. పల్లె ప్రకృతి వనమే.. గ్రామం నుంచి తానూర్ వెళ్లే దారిలో న్యూ కాలనీ దాటాక అండ్ బీ రోడ్డుకు పూర్తి కిందికి ఉండగా.. కనీసం ఎత్తు పెంచేందుకు మట్టితో నింపలేదు. లోతట్టు ప్రాంతంకాగా.. 15 గుంటల భూమిలో ఏర్పాటు చేశారు. భూమి కూడా ఎత్తుపల్లాలుగా, వంకరలు తిరిగి ఉంది. ట్రాక్టరుతో చదును చేసి.. ముందుగా మొక్కలు నాటారు. వాకింగ్ ట్రాక్ కోసం తర్వాత మొరం నింపడంతో.. ట్రాక్టర్లు తిరిగటంతో మొక్కలు కాస్తా విరిగిపోయాయి. మళ్లీ రెండోసారి మొక్కలు నాటినా.. అవి పెరగడం లేదు. మొరం, కూలీల కోసం డబ్బులు ఖర్చు చేశారు. ఇక్కడ నీటి సదుపాయం లేకపోగా.. మొరం భూమి కావడంతో పెరిగే పరిస్థితి లేదు.. అసలు పార్కుకు సరిపోయే స్థలం లేకపోగా.. ఈ స్థలం ఎంపికనే సరికాదనే విమర్శలున్నాయి. రాజకీయాలతీకతంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా.. అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం..

ఇక విలేజ్ పార్క్ ఇదే మండలం బోర్గాం గ్రామంలోనిది. అర ఎకరం స్థలంలో ఏర్పాటు చేశారు. భూమి చదును చేసి.. రకరకాల మొక్కలు పెంచారు. ఆర్మూర్ సమీపంలోని మామిడిపల్లి నర్సరీ నుంచి పూలు, పండ్ల మొక్కలతో పాటు ఉద్యానవనంలో పెంచే మొక్కలను తెచ్చి నాటారు. వనం చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో పాటు ఆకుపచ్చని షేడ్​నెట్​లాంటింది చుట్టారు. రోజూ క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ మొక్కలను సంరక్షిస్తున్నారు. గ్రామస్తులు తిరగడానికి అనువుగా ప్రకృతి వనంలో రోడ్లను నిర్మించారు. పిల్లలకు ఆడుకునే వస్తువులు కూడా పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కుకు వచ్చిన వారు కూర్చోందుకు అయిదు సిమెంటు బల్లలు ఏర్పాటు చేస్తుండగా.. వీటిని దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం పూట రంగురంగులు వెదజల్లేలా లైటింగ్ ఏర్పాటు చేశారు. స్థానికులకు ఈ పార్కు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతోంది. చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమనేందుకు ఇదో చక్కటి ఉదాహరణం.



Next Story