స్వీయ నియంత్రణ ఇక ప్రజల బాధ్యతే

by  |
స్వీయ నియంత్రణ ఇక ప్రజల బాధ్యతే
X

దిశ, న్యూస్ బ్యూరో: లాక్‌డౌన్ ఆంక్షల సడలింపుతో వైరస్ వ్యాప్తి పెరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా బారిన పడుతున్నందున్నా ప్రతీ ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించడం ద్వారానే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని, ఇకపై అది ప్రజల బాధ్యతేనని ప్రభుత్వం భావిస్తోంది. లక్షణాలు బైటపడిన తర్వాత పరీక్ష చేయించుకోవడం, పాజిటివ్ అని తేలితే చికిత్స చేయడం మినహా మరో మార్గం లేదని ప్రభుత్వం దాదాపు ఒక అంచనాకు వచ్చింది. ఇప్పుడున్న సడలింపులు రానురాను మరింత పెరుగుతాయి కాబట్టి కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందనుకుంటోంది ప్రభుత్వం. అందుకే త్వరలో ప్రైవేటు ల్యాబ్‌‌లకు పరీక్షలు నిర్వహించుకునేలా అనుమతి ఇవ్వనున్నట్లు తెలిసింది. ఆందోళన పడడంకంటే బయటకు వచ్చినప్పుడు వైరస్‌ను అంటించకుండా, ఇతరుల నుంచి అంటుకోకుండా మాస్కు, సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అనే నిర్ణయానికి వచ్చింది. వైరస్ బారిన పడకుండా చూసుకోవడం ప్రజల బాధ్యత అయితే వచ్చిన తర్వాత చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత అనే దిశగా ప్రభుత్వ విధానం ఉండనుంది.

”రాష్ట్రంలో సడలింపులు లేనంతవరకూ ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను శోధించి వారిలో లక్షణాలను పసిగట్టి పరీక్షలు నిర్వహించేవారు. ఇప్పుడు ఆంక్షల సడలింపుతో రోడ్లమీద రద్దీ పెరిగింది. వైరస్ వ్యాప్తి ఎక్కువైంది. ఇలాంటప్పుడు అది ఎక్కడిదాకా పాకిందో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఆంక్షలను సడలించే సమయంలోనే ప్రభుత్వానికి ఈ విషయంపై స్పష్టత ఉంది. లక్షణాలు బయటపడిన వెంటనే ప్రజలే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. అప్పుడు పరీక్ష చేసి చికిత్స చేయడం మేలు. ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయానికి వచ్చింది” అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారి ఒకరు వివరించారు. లక్షణాలు లేకపోయినా కరోనా ఉందో లేదో తేల్చడానికి అందరికీ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని అన్నారు. శ్వాసకోశ సంబంధ సమస్యలతో బాధపడేవారికి కరోనా పరీక్షలు చేస్తే కేవలం 3% మాత్రమే పాజిటివ్‌గా తేలుతున్నాయని తెలిపారు.

వృద్ధులు, పిల్లలే జాగ్రత్తపడాలి

వైరస్ కారణంగా మృతి చెందుతున్నవారిలో ఎక్కువ మంది అరవై ఏళ్ల పైబడిన వృద్ధులేనని, యువతలో రోగ నిరోధక శక్తి ఉన్నందున శరీరంలో వైరస్ ఉన్నా వచ్చే ఇబ్బందేమీ లేదనే అంచనాతో ఉంది వైద్యారోగ్య శాఖ. వైరస్ ఎవరిలో ఉందో తెలియదు కాబట్టి వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న ప్రాంతాల్లో వారికి అంటుతుందేమో అనే స్పృహతో ప్రతీ ఒక్కరూ వ్యవహరించడమే సరైన మందు అంటోంది. హైదరాబాద్ నగరంలో రాత్రిపూట జీవితం ఎక్కువ కాబట్టి వైరస్ వ్యాప్తిని వీలైనంతగా నివారించే ఉద్దేశంతో నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తోందని, దుకాణాలను సాయంత్రానికే మూసివేయాలనే నిర్ణయం కూడా ఇందులో భాగమేనని ఆ అధికారి పేర్కొన్నారు. రాష్ట్రంలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఇప్పటిదాకా లేకపోయినా నగరంలోని పాతబస్తీలో మాత్రం కొన్ని గల్లీల్లో ఇది కనిపించిందని, అందువల్లనే ఒకే కుటుంబంలో పాతిక మందికి పాజిటివ్ ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు.

సడలింపులతో పెరిగిన కేసులు

ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులను విశ్లేషిస్తే ఆంక్షల సడలింపునకు ముందు వచ్చిన కేసులు 1003. ఇవన్నీ 589 కుటుంబాలకు చెందినవి. సడలింపుల తర్వాత 1005 కేసులు నమోదయ్యాయి. ఇవి 470 కుటుంబాలకు చెందినవి. ప్రస్తుతం కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన చోట్ల ఆంక్షలు వద్దనే అభిప్రాయంతో ఉంది ప్రభుత్వం. ప్రైవేటు ల్యాబ్‌లలో కూడా పరీక్షలు చేయించుకునే వెసులుబాటును ఇవ్వాలనుకుంటోంది. గతంలోనైతే ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను పట్టుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు అది లేనందువల్ల పరీక్షలు ఎక్కడ చేయించుకున్నా ఫర్వాలేదనే అభిప్రాయానికి వచ్చింది. ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి వలస కార్మికులు వస్తున్నారు. నేరుగా గ్రామాలకే పోతున్నారు. దాదాపు 30% మందికి లక్షణాలు ఉన్నాయి. వారికే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

30 శాతం తగ్గిన సాధారణ మరణాలు

కరోనా కారణంగా వ్యక్తిగత పరిశుభ్రత పెరగడంతో దీర్ఘకాల వ్యాధుల సమస్య తగ్గిందని ప్రజారోగ్య శాఖ అభిప్రాయపడింది. లాక్‌డౌన్ పరిస్థితులను అర్థం చేసుకోవడడంతో మానసికంగానే ఇబ్బందులతో సర్దుకుపోయే తత్వం అలవడిందని అధికారి పేర్కొన్నారు. చిన్నా చితకా సమస్యలకు డాక్టర్లను సంప్రదించే పరిస్థితులు లేకపోవడం వల్ల ఆసుపత్రుల చుట్టూ తిరగడం కూడా తగ్గిపోయిందన్నారు. హోటళ్లలో తినడంతో కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు వచ్చేవని, ఇప్పుడు అది లేకపోవడంతో ప్రజలు డాక్టర్లను సంప్రదించే అవసరం రాలేదన్నారు.

మూడు మంత్రదండాలు: డైరెక్టర్ శ్రీనివాసరావు

ఇటీవలి కాలంలో పెరుగుతున్న కరోనా కేసులు, మృతుల గురించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత శుభ్రత, మాస్కు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం అనే మూడు మంత్ర దండాలతో వైరస్ మారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. ఇప్పటివరకూ సుమారు 30 వేల పరీక్షలు చేశామని, ఇందులో రెండున్నర వేలు కూడా పాజిటివ్ రాలేదని తెలిపారు. ఎక్కువ పరీక్షలు చేయడం పాజిటివ్‌గా తేలడానికి ప్రామాణికం కాదన్నారు. సుమారు ఒకటిన్నర లక్ష మంది వలస కార్మికులు రాష్ట్రానికి చేరుకున్నారని, ఇందులో సుమారు 60% మంది మహాష్ట్ర నుంచి వచ్చినవారేనని ఇందులో చాలా మంది వైరస్ ఇన్‌పెక్షన్ బారిన పడినవారేనన్నారు. ఇప్పుడు ఆంక్షలను సడలించినందువల్ల తమ శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. సడలింపులతో భారీ స్థాయిలో కేసులు పెరుగుతాయనుకున్నాంగానీ, నియంత్రణ చర్యలతో ఊపిరి పీల్చుకున్నామన్నారు.

సామాజిక దూరం గురించి వివరిస్తూ, ఒకే అపార్టుమెంటులో బర్త్ డే పార్టీ వేడుకల్లో వందల సంఖ్యలో పాల్గొనకుండా ఉంటే పాజిటివ్ వచ్చేదా అని ప్రశ్నించారు. చాలా మందిలో వైరస్ ఉన్నప్పటికీ అనారోగ్య లేనంతవరకూ దానితో వచ్చే ఇబ్బందేమీ లేదని, అయినా ప్రభుత్వం పాజిటివ్ పేషెంట్ల విషయంలో సీరియస్‌గానే ఉందన్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలోనే చాలా బెడ్‌లు ఖాళీగా ఉన్నాయని, కేసులు పెరిగినా వెంటనే గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. వైరస్‌తో భయపడాల్సిన పనిలేదని, దేశమంతా చూస్తున్న పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి అదుపులో ఉన్నట్లేనన్నారు.

Next Story

Most Viewed