బడ్జెట్ ధరల కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి : నితిన్ గడ్కరీ

by  |
బడ్జెట్ ధరల కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరి : నితిన్ గడ్కరీ
X

దిశ, వెబ్‌డెస్క్: రానున్న రోజుల్లో తక్కువ ధరలో లభించే కార్లలో సైతం ఆరు ఎయిర్‌బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండేలా వాహనాలను తయారు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలకు భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రీమియం, లగ్జరీ కార్లలో మాత్రమే ఎయిర్‌బ్యాగ్స్ ఉంటున్నాయి. ఇకమీదట సాధారణ ప్రజలు కొనే బడ్జెట్ ధరల కార్లలో కూడా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండేలా వాహనాలను తీసుకురావాలని ఆటో కంపెనీలకు ఆయన సూచించారు. దీనివల్ల ప్రజలను ప్రమాదాల నుంచి రక్షించవచ్చని, మరణాల రేటును తగ్గించవచ్చని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

అయితే, ఇప్పటికే వాహనాలపై అధిక పన్నులు ఉన్నాయని, ఉద్గార నిబంధలతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని వాహన తయారీ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజా నిర్ణయం కంపెనీలు కొంత ఇబ్బందిని ఎదుర్కొనవచ్చు. సాధారణంగా లగ్జరీ కార్లలో ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్ ఉంటున్నాయని, చిన్న కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ ఉండటంలేదని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. చిన్న కార్లను కొనేవారిలో దిగువ, మధ్య తరగతి వర్గం వారే ఎక్కువని, వారు కొనే కార్లలో ఎయిర్‌బ్యాగ్స్ ఉండటంలేదని, ప్రమాదం జరిగితే ప్రాణాలను కోల్పోయే అవకాశాలు ఎక్కువని నితిన్ గడ్కరీ వివరించారు. పైగా, చిన్న కార్లలో ఎయిర్‌బ్యాగ్స్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 3-4 వేలు మాత్రమే ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed