మృత్యువు ఒడిలో విధులు

by  |
మృత్యువు ఒడిలో విధులు
X

దిశ, కరీంనగర్: రామగుండం రీజియన్ లోని ఓ గని.. లోపల విధులు నిర్వర్తించేందుకు కార్మికులంతా లోపలకు వెళ్తున్నారు.. వారిలో ఓ కార్మికుడు కొంచెం ముందుగా నడుస్తున్నాడు.. అంతలోనే అతని వెనక పై కప్పునుండి పెలపెలమంటూ పెల్లలు పడిపోయాయి. అతను వెనక్కి వచ్చే దారి లేకుండా పోయింది. వెనక ఉన్న వారు అతన్ని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. కాపాడాలంటూ అరుస్తున్నా నిస్సహాయులుగా చూస్తుండి పోయారు సహచర కార్మికులు. అరుస్తూ అరుస్తూ ప్రాణాలు అక్కడే వదిలేశాడు. కళ్ల ముందే తోటి కార్మికుడు ప్రాణాలు కొల్పోతున్నా కాపాడలేని ధైన్యంతో పాటు కళ్ల సహచరుడు మరణించడం చూసి తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇది 2003లో 8 ఇంక్లైన్ బొగ్గు బావిలో జరిగిన సంఘటన. బొగ్గు నిక్షేపాలు వెలికి తీసేందుకు సింగరేణి ఏర్పాటు చేసిన భూగర్భ గనుల్లో పనిచేసే కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి నల్లబంగారాన్ని వెలికి తీస్తున్నారు.

గని లోపల చీకట్లను తరిమేందుకు చిన్నపాటి ల్యాంప్, శ్వాస తీసుకునేందుకు ఆర్టిఫిషియల్ గా అందించే ఆక్సిజన్ తో సరిపెట్టుకుంటూ డ్యూటీ చేస్తుంటారు. అయితే మైన్ లోపల బొగ్గు సేకరించేందుకు ఎన్నో దారులు ఉంటాయి. ఈ దారుల వెంట లోపలకు వెళ్లి బొగ్గును తవ్వి తీసే కార్మికులు డ్యూటీ ముగిసిన తరువాత బయటకు చేరుకున్నారంటేనే మరణం అంచులదాకా వెళ్లొచ్చినట్టుగా భావిస్తారు. నిత్యం ప్రాణాపాయం మధ్య సాగే వీరి డ్యూటీ గనిలోపల ఏ వైపు నుండి చావు ముంచుకొస్తుందో తెలియదు. రూఫ్ భాగం కుప్పకూలీనా, నీరు ఉబికి వచ్చినా అంతే సంగతులు అని చెప్పాలి. ఇలాంటి ప్రమాదాలు ఎన్నోసార్లు ఎదుర్కొన్న కార్మికులు ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల సాంకేతికతను కూడా అందిపుచ్చుకుని సింగరేణి యాజమాన్యం ముందుకు సాగుతున్నా కార్మికుల ప్రాణాలకు మాత్రం గ్యారెంటీ లేకుండా పోయిందనే చెప్పాలి. 2003లో 8 ఇంక్లైన్ కాలనీలో సత్యనారాయణ అనే కార్మికుడు ముందు నడిచి రూఫ్ కుప్ప కూలడంతో ప్రాణాలు కొల్పోయారు.

తాజాగా 11 ఇంక్లైన్ లో సంజీవ్ అనే కార్మికుడు పంప్ ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తూ మిస్సయ్యాడు. ఐదు రోజుల క్రితం గనిలో సంజీవ్ ఆచూకి లేకుండా పోవడంతో సింగరేణి యాజమాన్యం స్పెషల్ టీంలను రంగంలోకి దిగి గాలింపు ముమ్మరం చేస్తోంది, అయినప్పటికీ అతని జాడా మాత్రం కానరావడం లేదు. సీంగరేణి ఉన్నతాధికారులు కూడా 11 ఇంక్లైన్ వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సుమారు 16 టీంలు గనిలో అతని ఆచూకి కోసం వెతుకుతున్నారు. గని లోపలో నీటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నా కూడా సంజీవ్ ఆచూకి లభ్యం కావడం లేదు.

రెస్క్యూ టీం ప్రాణాలకు కూడా గ్యారెంటీ లేని పరిస్థితి..

గత డిసెంబర్ లో అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో విష వాయువు వెలువడుతోందని సింగరేణి యాజమాన్యం రెస్క్యూ టీంను రంగంలోకి దింపింది. టీం కమెండో దిలీప్ విషయవాయువు కారణంగా అనారోగ్యానికి గురి కాగా అతడిని వెంటనే బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో రెస్క్యూ టీం కూడా భయం నీడన డ్యూటీ చేస్తోంది. ఎప్పుడు ఎలా మృత్యువు ముంచుకొస్తుందో అంతుచిక్కని పరిస్థితుల్లో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సింగరేణి ఆధునిక టెక్నాలజీని వినియోగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. గనిలో కార్మికుడు గల్లంతయితే అతని ఆచూకి కోసం గనిపై నుండి హోల్ చేసి ఆచూకి కనుగోనేందుకు వచ్చిన సాంకేతిక పరికరాన్ని సింగరేణి యాజమన్యం అందుబాటులో తీసుకొస్తే సానుకూల ఫలితాలు వస్తాయని కార్మిక నాయకులు అంటున్నారు. తరుచూ జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలు ఎదురుకాకుండా ఉండే విధంగా చొరవ చూపాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు.

Tags: Singareni Workers, Troubles, Concerns, Trouble on Duty, Rescue Team, New Technology


Next Story

Most Viewed