సింగరేణి టర్నోవర్ రూ.14,067 కోట్లు : సీఎండీ శ్రీధర్

by  |
Singareni
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఏడు నెలల కాలంలో రూ.14067 కోట్ల అమ్మకాలు జరిపి, రూ.868 కోట్ల లాభాలను అర్జించిందని సింగరేణి సంస్థ సీఎ౦డీ శ్రీధర్ వెల్లడించారు. సింగరేణి బొగ్గు గనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో గత నాలుగు రోజులుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం సంస్థ ఆర్థిక విషయాలపై శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెలతో ముగిసిన తొలి ఏడు నెలల కాలంలో రూ.8537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 65 శాతం వృద్ధితో రూ.14,067 కొట్ల అమ్మకాలు జరిపిందన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో బొగ్గు అమ్మకాలు ,రవాణా తగ్గడంతో రూ.1129కోట్ల నష్టాలను కంపెనీ చవి చూసిందని, కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల్లో కరోనా నివారణ చర్యలు ఫలించి బొగ్గు ఉత్పత్తి, రవాణా, విద్యుత్ అమ్మకాలు కూడా పెరగడంతో గత ఏడాదిపై 177శాతం వృద్ధితో రూ.868కోట్ల లాభాలను సాధించ గలిగామని వివరించారు.

బొగ్గు అమ్మకాలలో 78 శాతం వృద్ధి..

బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి గడిచిన ఏడు నెలల్లో సింగరేణి సంస్థ గత ఏడాది ఇదే కాలంలో సాధించిన దానిపై 65శాతం అభివృద్ధిని కనపరచగా, కేవలం బొగ్గు అమ్మకాలలో 78 శాతం వృద్ధి, విద్యుత్ అమ్మకాలలో 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది తొలి ఏడు నెలల కాలంలో రూ.6678 కోట్ల బొగ్గు అమ్మకాలు జరపగా ఈ ఆర్థిక సంవత్సరంలో అదే కాలానికి 78 శాతం వృద్ధితో రూ.11,855 కోట్ల విలువైన బొగ్గు అమ్మకాలు నిర్వహించింది. కాగా గత ఏడాది తొలి ఏడు నెలల్లో రూ.1860 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరగగా ఈ ఏడాది అదే కాలానికి 18 శాతం వృద్ధితో రూ.2182కోట్ల విద్యుత్ అమ్మకాలు జరిపింది.

గత ఏడాది కాలంగా కంపెనీ వ్యాప్తంగా తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలు, నిరంతరాయంగా నిర్వహిస్తున్న ఉత్పత్తి సమీక్షలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో తొలి ఏడు నెలల్లో సాధించిన బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి కన్న ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలో సాధించిన అద్భుత వృద్ధి కారణంగా అమ్మకాలు లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి.

గత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో కేవలం 220 లక్షల టన్నుల బొగ్గు ను ఉత్పత్తి చేసిన సింగరేణి సంస్థ.. ఈ ఏడాది అదే కాలానికి 60 శాతం వృద్ధితో 352 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగలిగింది. అలాగే గత ఏడాది తొలి ఏడునెలల్లో 218 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపిన సింగరేణి ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 68 శాతం వృద్ధితో 367 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసింది. అలాగే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గత ఏడాది అక్టోబర్ నెల వరకు 3819 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి 39 శాతం వృద్ధితో 5291 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలకు అందించడం జరిగింది. ఫలితంగా టర్నోవర్ లాభాలు గణనీయంగా పెరిగాయి.

ఈ ఏడాది చరిత్రలోనే అత్యధిక టర్నోవర్ లాభాలు

దేశ రాష్ట్ర విద్యుత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సింగరేణి సంస్థ తన శక్తి మేర సాధ్యమైనంత ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేస్తూ అవసరమైన థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అందజేస్తోందని, ఇదే ఒరవడితో మిగిలి ఉన్న ఐదు నెలల కాలంలో కూడా గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేయనున్నామని, దేశ విద్యుత్ అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా సింగరేణి కుటుంబం మొత్తం అంకితభావంతో పనిచేస్తోందని ఆయన వివరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది సింగరేణి తన చరిత్రలోనే అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, వార్షిక టర్నోవర్, లాభాలు సాధించనున్నదని సంస్థ చైర్మన్ అండ్ ఎండి శ్రీ ఎన్.శ్రీధర్ తెలియజేశారు.


Next Story

Most Viewed