చిన్న పరిశ్రమలకు రుణాలిచ్చేందుకు గూగుల్‌తో సిడ్బీ భాగస్వామ్యం!

130

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న చిన్న పరిశ్రమలకు ఆర్థిక పరమైన మద్దతు అందించేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నట్టు సిడ్బీ తెలిపింది. ప్రత్యేక సామజిక రుణ కార్యక్రమంలో భాగంగా సబ్సిడీ వడ్డీ రేట్లలో రూ. కోటి వరకు రుణాలను ఇవ్వనున్నట్టు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్(సిడ్బీ) ప్రకటించింది.

గూగుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం ద్వారా కరోనా మహమ్మారి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు.. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు 15 మిలియన్ డాలర్ల (రూ.110 కోట్ల) కార్పస్ ఫండ్ అనుబాటులోకి తీసుకొచ్చినట్టు సిడ్బీ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్(రూ.5 కోట్లలోపు టర్నోవర్ ఉన్న) కంపెనీలను లక్ష్యంగా చేసుకుని మొదలుపెట్టామని, రూ.25 లక్షల నుంచి రూ. కోటి వరకు రుణాలను ఇవ్వనున్నట్టు వివరించింది.

‘ఎంఎస్ఎం రంగం క్రెడిట్ యాక్సెస్‌ను విస్తరించడానికి తమ ప్రయత్నాలను మెరుగుపరచడానికి తగిన సహకారాన్ని అందిస్తున్నాం. అందుకవసరమైన నిర్మాణాత్మక ప్రభావాన్ని చూడగలమనే నమ్మకం ఉంది’ అని సిడ్బీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివసుబ్రమణియన్ అన్నారు. చిన్న పరిశ్రమలకు తగిన మద్దతు ఇస్తామని, ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని గూగుల్ ఇండియా వైస్-ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా అన్నారు.