రికార్డుల ఆస్పత్రిలో వైద్యుల కొరత..!

by  |
Doctor142
X

దిశ, చిట్యాల: రాష్ట్రంలోనే ఒకప్పుడు రికార్డులు నెలకొల్పిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల కొరతతో వెలవెలబోతోంది.30 పడకలుగా ఉన్న ఆసుపత్రిని 50 పడకలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామని చెప్పిన ముఖ్యనేతల మాటలు నీటిమూటలుగా మిగిలిపొయాయి. ఏళ్ల తరబడి ఇదే తంతు కొనసాగుతున్నా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడడంలేదు. రోగులకు పూర్తిస్థాయి వైద్యం అందక అవస్థలు ఎదుర్కొంటున్నా పట్టించుకున్నా నాథుడే కరువయ్యారు. వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఇక్కడ రికార్డు స్థాయిలో ప్రసవాలు చేసి రాష్ట్రంలోనే పేరుగాంచింది. ఇందులో భాగంగానే అప్పటి మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆసుపత్రి అప్ గ్రేడ్ కోసం నిధులను మంజూరు చేయించి పనులను పూర్తి చేశారు. కానీ, 50 పడకల ఆసుపత్రిగా క్షేత్రస్థాయిలో అప్ గ్రేడ్ కాలేదు. అయినా 30 పడకల ఆసుపత్రికి సరిపడా వైద్యులు లేరు. దీంతో రోగులకు మెరుగైన వైద్యం అందని ద్రాక్షగా మిగులుతోంది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి వైద్యులను నియమించాలని కోరుతున్నారు.

ఐదుగురు వైద్యులు మాత్రమే.. అందులో ముగ్గురే రెగ్యులర్

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఒకప్పుడు రోగులతో కిటకిటలాడుతుండేది. ప్రతి రోజూ చిట్యాల మండలంతోపాటు టేకుమట్ల, మొగుళ్లపల్లి, రేగొండ మండలాల నుంచి రోగులు ఆసుపత్రికి వచ్చి మెరుగైన వైద్యసేవలు పొందేవారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. 19 మందికి గాను ఐదుగురు వైద్యులు మాత్రమే ఉన్నారు. అందులో ముగ్గరు రెగ్యులర్ డాక్టర్లు ఉండగా ఇద్దరు కాంట్రాక్టు డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పూర్తి స్థాయి వైద్యం అందడంలేదు. దీంతో రోగులు పరకాల, వరంగల్, భూపాలపల్లి, హన్మకొండ తదితర ప్రాంతాల్లోని ప్రవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. దీంతో పేద ప్రజలకు అవస్థలు తప్పడంలేదు.

మెరుగైన వైద్యం లేక రెఫర్

చిట్యాల ప్రాంతంలో ఏదైనా ప్రమాదం సంభవించి క్షతగాత్రులైనా.., ఆత్మహత్య కోసం క్రిమిసంహారక మందును సేవించిన వారినైనా ఇక్కడికి తీసుకువస్తే వారిప్రాణాలకు ఎలాంటి భరోసా ఉండదన్నది ఇక్కడి ప్రజలకు తెలిసిన సత్యం. గడిచిన ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వాసుపత్రిలో ఎమర్జెన్సీ కింద వచ్చే కేసులకు భరోసా లేకుండా పోయిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. చిన్నచిన్న చికిత్సలు చేస్తున్నారే తప్ప క్షతగాత్రులకు మాత్రం రెఫర్‌ చేయక తప్పడం లేదు. పూర్తిస్థాయిలో వైద్య బృందం లేకపోవడం, వైద్య పరికరాలు అంతంతమాత్రంగానే ఉండటం వల్ల మెరుగైన వైద్యం అందడం లేదు.

superintendent1

వైద్యుల కోసం నోటిఫికేషన్ జారీ చేశాం: తిరుపతి (చిట్యాల ఆసుపత్రి సూపరింటెండెంట్)

చిట్యాల ప్రభుత్వాస్పత్రిలో వైద్యుల కొరత ఉంది వాస్తవమే. ఇందుకోసం ఉన్నతాధికారులకు లేఖ కూడా రాయడం జరిగింది. ఇటీవలే వైద్యుల నియామకానికి నోటిఫికేషన్ కూడా విడుదలైంది. కానీ వైద్యులు ఎవరూ ఆసక్తి చూపలేదు. కనీసం పనిచేయడానికి దరఖాస్తు కూడా చేసుకోలేదు. త్వరలోనే పూర్తి స్థాయి వైద్యులు నియమించేందుకు తప్పకుండా కృషి చేస్తాం. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలను అందిస్తున్నారు.

పేరుకు మాత్రమే 50 పడకలు: కోడెల భద్రయ్య (టిడిపి జిల్లా నాయకుడు)

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేశామని గొప్పలు చెబుతున్నారు.. కానీ, క్షేత్ర స్థాయిలో అమలు చేయకపోవడం సిగ్గుచేటు. వైద్యుల కొరత వల్ల రోగులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతమందిని రిఫర్ చేస్తే మార్గమధ్యలోనే మరణిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే, కలెక్టర్ చొరవ తీసుకుని పూర్తిస్థాయిలో వైద్యుల నియామకాన్ని చేపట్టాలి.

Next Story

Most Viewed