నిబంధనలతో ఆట రంజుగా ఉండదు: షకీబుల్ హసన్

by  |
నిబంధనలతో ఆట రంజుగా ఉండదు: షకీబుల్ హసన్
X

దిశ, స్పోర్ట్స్: లాక్‌డౌన్ తర్వాత జరగనున్న క్రికెట్ మ్యాచుల్లో ఆటగాళ్లు, అంపైర్లు, సహాయక సిబ్బంది ఎలా మసులుకోవాలో తెలుపుతూ ఐసీసీ విడుదల చేసిన మార్గదర్శకాలపై బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబుల్ హసన్ విమర్శనాత్మకంగా స్పందించాడు. ఐసీసీ నిబంధనలు చూస్తే లాక్‌డౌన్ తర్వాత ఆట రంజుగా ఉండదనే విషయం అర్థమవుతోందని అన్నాడు. బౌలర్ ఔట్ చేశాక ఆరడుగుల దూరం నుంచి ఎలా సంబురాలు చేసుకుంటాడని ప్రశ్నించాడు. ఓవర్ పూర్తయిన తర్వాత బ్యాట్స్‌మెన్ కలిసి తర్వాత ఓవర్‌లో ఎలా ఆడాలనే వ్యూహాలను రచించుకోవద్దా అని అడిగాడు. అయితే, డబ్ల్యూహెచ్‌వో తాజాగా, 12 అడుగుల దూరం వరకు కరోనా వైరస్ గాల్లో ప్రయాణిస్తుందని చెబుతోందనీ, ఇలా అయితే 12 అడుగుల దూరంలో ఆటగాళ్లు నిలబడాలా అని నిలదీశాడు. నిజంగా 12 అడుగుల దూరంలో నిలబడితే ఫస్ట్ స్లిప్, సెకెండ్ స్లిప్ ఆటగాళ్లు ఎక్కడ నిలబడాలని అంటున్నాడు. స్పిన్నర్లు బౌలింగ్ చేసే సమయంలో కీపర్ వికెట్ల నుంచి ఎంత దూరంలో ఉండాలి. అలా అయితే క్యాచ్‌లు దొరుకుతాయా అని ప్రశ్నించాడు. కాగా, షకీబుల్ మీద ఐసీసీ నిషేధం విధించడంతో ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ నిషేధం రానున్న అక్టోబర్‌లో ముగియనుంది.



Next Story