దడదడలాడించే పోలీసులనే గడగడలాడించిన ఘటన ఇదీ!

by  |
దడదడలాడించే పోలీసులనే గడగడలాడించిన ఘటన ఇదీ!
X

దిశ, కరీంనగర్: తాళం వేసి ఉన్న ఇళ్లకు కన్నం వేసిన దొంగలను చూశాం.. రాత్రి పూట చోరీలకు పాల్పడే ముఠాలనూ చూశాం.. కానీ, దొంగలను దడదడలాడించే పోలీసులనే గడగడలాడించిన ఘటనలు చాలా తక్కువగా చూస్తాం. సరిగ్గా ఇలాంటి కోవకే చెందుతుంది కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన లిక్కర్ చోరీ ఘటన. లాక్ డౌన్‌తో లిక్కర్ దొరకడమే లక్కీ అనుకున్న వారు ఎంత ధర అయినా చెల్లించి మద్యం కొనుగోలు చేస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకున్న అరుణ్ అనే కానిస్టేబుల్, రాణా అనే వ్యక్తి కలిసి దర్జాగా సీజ్ చేసిన లిక్కర్ ఎత్తుకెళ్లారు. పగలు రాత్రి నిరంతరం డేగ కళ్లతో తమ నిఘా నేత్రానికి పని చెప్పాల్సిన పోలీసులు వందల సంఖ్యలో ఉన్నా 3 సార్లు చోరీకి పాల్పడి 69 బాటిళ్లను పట్టుకెళ్లారు. అయితే, వీరు ఈ ఠాణా కాంప్లెక్స్‌లో ఉన్న అంతమంది పోలీసులను ఎలా మభ్యపెట్టగలిగారు..? అన్నది అంతుచిక్కకుండా తయారైంది. ఈ ఘటన పోలీసుల అంతర్గత భద్రతా తీరును ఎత్తిచూపుతోంది. ఈ లిక్కర్ చోరీ వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

పోలీసు కాంప్లెక్స్‌లోనే చోరీ..

ఓ డీఎస్పీ, ఇద్దరు సీఐలు, 140 మంది వరకు పోలీసు సిబ్బంది, 10 వరకు సీసీ కెమెరాలు ఇన్ని ఉన్నా వారు తమ పని కానిచ్చారు. పోలీస్ కాంప్టెక్స్‌లా ఉండే కరీంనగర్ టూ టౌన్‌లోనే లిక్కర్ చోరీ జరిగింది. ఈ లిక్కర్ బాటిళ్ల మాయం కేసులో ఓ కానిస్టేబుల్‌తో పాటు మరో ప్రైవేటు వ్యక్తిని అరెస్ట్ చేసి పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారుల విచారణలో వీరికి ఎవరి సపోర్ట్ లేకుండానే చేశారని తేలిందని చెప్తున్నారు. అయితే, ఇందులో ఉన్న ఇతరులను కాపాడేందుకు ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా.? అనే చర్చ కూడా సాగుతోంది. రాణా అనే ప్రైవేటు వ్యక్తి ఓ పోలీసు అధికారి వాహనం నడుపుతున్నారు. ఇతను పోలీసు కాంప్లెక్స్‌లో స్వేచ్ఛగా తిరగడం ఎలా సాధ్యమైంది? అసలు డిపార్ట్‌మెంట్‌లో ప్రైవేటు వ్యక్తులను డ్రైవర్లుగా
పెట్టుకోవడం నిబంధనల మేరకే జరగిందా? అనే పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హోం గార్డును నియమించాలంటేనే సవాలక్ష రకాలుగా ఎంక్వైరీ చేసీ అవకాశం కల్పించే పోలీసు విభాగంలో ప్రైవేటు డ్రైవర్లను నియమించుకునే ప్రక్రియ ఎలా జరిగింది అన్నది తెలియాలి. కాంట్రాక్టు బేసిక్ అయినా, ఔట్ సోర్సింగ్ ద్వారా అయినా తీసుకునే అవకాశం ఉన్నా ఈ మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందా? డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయా అన్న విషయం అంతుచిక్కడం లేదు. నేరాలను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్ లోనే చోరీ జరగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags: covid 19 effect, lock down time, karimnagar two town police station, , theft, constable, private person

Next Story

Most Viewed