సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో మళ్లీ కర్ఫ్యూ

by  |
సెకండ్ వేవ్ ఎఫెక్ట్.. మహారాష్ట్రలో మళ్లీ కర్ఫ్యూ
X

ముంబయి: మహారాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ విధించలేదు గానీ, కఠిన కర్ఫ్యూను అమలు చేయనుంది. బుధవారం మొదలు 15 రోజులపాటు అంటే మే 1వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీన ఉదయం 7 గంటల వరకు ఈ కఠిన ఆంక్షలను అమలు చేయనుంది. ఈ కాలంలో నలుగురికి మించి ఒకచోట గుమిగూడవద్దని, అత్యవసర సేవలకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి ఉంటుందని రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థను అప్‌గ్రేడ్ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం మెడికల్ ఆక్సిజన్, బెడ్ల కొరత ఉన్నదని, రెమెడెసివర్ డ్రగ్ డిమాండ్ కూడా పెరుగుతున్నదని చెప్పారు. పొరుగు రాష్ట్రాల నుంచి వైద్యావసరాల కోసం ఆక్సిజన్‌ను తెచ్చుకోవడానికి వైమానిక దళాల సహకారాన్ని అందించాల్సిందిగా పీఎం మోడీతో మాట్లాడతారని అన్నారు. రాష్ట్రంలో కరోనా ఆంక్షలపై ప్రకటన చేయడానికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ప్రజలనుద్దేశించి రాత్రి 8.30 గంటలకు మాట్లాడారు.

3 కిలోల గోధుమలు, 2 కిలోల బియ్యం

వచ్చే నెలలో ప్రతి పేద వ్యక్తికి మూడు కిలోల గోధుమలు, రెండు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం ఠాక్రే ప్రకటించారు. ఈ కర్ఫ్యూలో భాగంగా ప్రజా రవాణాలో భాగమైన ట్యాక్సీలు, బస్సులు, విమానాలు, ట్రైన్‌ల సేవలు షరతులతో అందుబాటులో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంలు, నిర్మాణ పనులు కొనసాగనున్నాయి. అయితే, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, సెలూన్లు, ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు మూసిఉండనున్నాయి. కిరాణాలు, కూరగాయ, పండ్ల దుకాణాలు, స్థానిక అధికారులు అందించే సేవలన్నీ కొనసాగనుండగా, కాలేజీలు, స్కూళ్లు, బహిరంగ ప్రాంతాలు, బీచ్‌లు మూసే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. షూటింగ్‌ను నిషేధం విధించింది.


Next Story

Most Viewed