ఆంధ్రా సరిహద్దులో సీక్రెట్ యవ్వారం.. పోలీసులపైనే ప్రైవేట్ నిఘా..!

by  |
ఆంధ్రా సరిహద్దులో సీక్రెట్ యవ్వారం.. పోలీసులపైనే ప్రైవేట్ నిఘా..!
X

దిశ, ములకలపల్లి : ఆంధ్రా సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతంలో కొందరు గుట్టుగా సీక్రెట్ దందా కొనసాగిస్తున్నారు. కోడిపందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. దీనికి కేరాఫ్ అడ్రస్‌గా ‘ములకలపల్లి’ నిలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇటీవలి కాలంలో ఈ మండలం పేరు జూదానికి చిరునామాగా ప్రాచుర్యం పొందింది. స్థానిక పోలీసులు ఉదాసీనతతో వ్యవహరిస్తుండటంతో జూదం నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. అడ్డూ అడుపులేకుండా ఎక్కడపడితే అక్కడ కోడి పందాలు, పేకాట నిర్వహిస్తుండటంతో నిత్యం మండలం పేరు వార్తల్లో నిలుస్తోంది. స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా టాస్క్ఫోర్స్ సిబ్బంది దాడులు చేసి కేసులు నమోదు చేస్తుండటంతో లోకల్ పోలీసులకు ఇబ్బందిగా మారింది. జూదం నిర్వహణ తాలూకు బురద స్థానిక పోలీసులకు అంటుకోక తప్పడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ కోడిపందాలు, పేకాట స్థావరాలపై దాడులు చేసిన ప్రతీసారి పెద్ద సంఖ్యలో పందెం రాయుళ్లు, పేకాట రాయుళ్లు పట్టుపడుతుంటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

సరిహద్దుల్లో స్థావరాలు.. పోలీసు కదలికలపై నిఘా

ములకలపల్లి మండలం తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ అంతరాష్ట్ర సరిహద్దు కావడం, దీనికి తోడు ఈ ప్రాంతం మొత్తం పూర్తిగా అడవితో నిండిపోవడంతో జూదాల నిర్వాహకులకు కలిసొస్తుంది. మండలంలోని సుందర్ నగర్ మొదలుకుని గుండాలపాడు వరకు సుమారు 20 కిలోమీటర్లు మేర ఈ సరిహద్దు ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతమంతా జూదాలకు కేరాఫ్‌గా మారిపోయింది. కోడిపందాలు, పేకాట నిర్వాహకులు ఈ అడవుల్లో స్థావరాలను ఎప్పటికప్పుడు మార్చుతూ పోలీసులను ఏమార్చుతుంటారు. పేకాట నిర్వాహకులు చాలా పకడ్భందీగా ఆట నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటారని తెలుస్తోంది. పేకాట నిర్వహించే ప్రదేశానికి వెళ్లే దారుల్లో సమాచారం కోసం వాళ్ళ మనుషులను ఏర్పాటు చేసి పోలీసు కదలికలపై నిఘా ఉంచుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

నిర్వాహకులపై చర్యలేవి?

నిత్యం కోడి పందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగులు మండలంలో జోరుగా సాగుతున్నాయి. వీటి మూలంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా ఛిద్రమై పోతున్నాయి. గత నెలలో మంగలి గుట్ట అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిచేసి 46 మోటార్ సైకిల్లు, 15 కోడిపుంజులు, 3 సెల్ ఫోన్లు, ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్ట్ చేసి రూ.14,970 నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల తిరక్కుండానే అదే ప్రాంతంలో జీడితోటలో పెద్ద మొత్తంలో పేకాట స్థావరం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు దాడిచేసి అరెస్టు చేసిన 19 మంది నుంచి రూ. 1,10,320 నగదు, 8 టచ్ మొబైల్స్, 6 కీ ప్యాడ్ మొబైల్స్, 7 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా చాలా మంది పరారైనట్లు సమాచారం. ఇందులో అసలు నిర్వాహకులు ముగ్గురు పరారీలో ఉన్నారు. దాడి చేసిన ప్రతీ సారి ఈ జూదంలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టి వదిలేయడం మూలంగా ఎలాంటి ఉపయోగం ఉండటం లేదు. అసలు ఈ జూదం నిర్వహిస్తున్న వారిని, వాటిని ప్రోత్సహిస్తున్న వారిని.. వీరి వెనక ఉన్న పెద్ద మనుషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి మళ్లీ పునరావృతం కావని అభిప్రాయం వ్యక్తం అవుతోంది.



Next Story

Most Viewed