నదీజలాలను తాగునీటిగా మార్చే ‘హైడ్రోజెల్ టాబ్లెట్’

by  |
Tablets-1
X

దిశ, ఫీచర్స్: పర్వత ప్రాంతాల్లో ట్రెకింగ్‌కు వెళ్లినప్పుడు వెంటతెచ్చుకున్న వాటర్ అయిపోతే ఏం చేస్తారు? చుట్టుపక్కల ఎక్కడైనా నీటి వనరులు ఉన్నాయో వెతుకుతారు. దగ్గర్లో ఏదైనా కాలువ లేదా నీటి ప్రవాహం కనిపించినా అందులోని నీటి స్వచ్ఛత గురించి తెలియదు. కాచి చల్లార్చి తాగాలంటే చాలా సమయం పడుతుంది. ఓవైపు గొంతు ఆరిపోతుంటే కళ్లముందు నీళ్లుండి కూడా తాగలేని పరిస్థితిలో సతమతమవుతుంటారు. ఈ క్రమంలోనే కలుషిత నీటిని ప్యూరిఫై చేయగల ‘హైడ్రోజెల్’ ట్యాబ్లెట్‌ను డెవలప్ చేశారు టెక్సాస్, ఆస్టిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఈ మాత్రలు యాక్టివేటెడ్ కార్బన్‌తో పాటు హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను ఏర్పరచడం ద్వారా నీటిలో ఉండే బ్యాక్టీరియాను చంపగలవు.

‘హైడ్రోజెల్’ అనేది మల్టీఫంక్షనల్ హైడ్రోఫిలిక్ పాలిమర్. ఇది తాగునీటి కొరతను సమర్థవంతంగా అరికట్టి, నీటి వినియోగంలో విప్లవాన్ని తీసుకురాగలదని టెక్సాస్‌లోని ‘కాక్రెల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్’ అసోసియేట్ ప్రొఫెసర్ గుయిహువా యు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. హైడ్రోజెల్ టాబ్లెట్ ఒక గంటలో ఒక లీటరు నీటిని శుద్ధి చేయగలదు. ఈ పద్ధతి అదనపు ప్రయోజనాన్ని కలిగించే అవకాశం ఉండగా, శుద్ధీకరణకు ఎలాంటి శక్తి అవసరం లేదు. అంతేకాదు ఈ ప్రాసెస్‌లో ఎటువంటి హానికర ఉప ఉత్పత్తులు కూడా ఏర్పడవు. మనం సాధారణంగా ఉపయోగించే పద్ధతులకు థర్మల్ ఎనర్జీ (మరిగే) లేదా సౌర శక్తి అవసరం. సౌరశక్తిని ఉపయోగించడం వల్ల సూక్ష్మజీవులు పేరుకుపోవచ్చు. కానీ, ఈ ట్యాబెట్ల వల్ల అటువంటి పరిస్థితులు ఎదురుకావంటున్నారు శాస్ర్తవేత్తలు.

ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని సర్వేలు చెబుతున్నాయి. 2025 నాటికి సగం జనాభా నీటి ఎద్దడిగల ప్రాంతాల్లో నివసించవచ్చు. ఈ అంశాల పట్ల అప్రమత్తమైన గ్రాడ్యుయేట్ విద్యార్థి యూహోంగ్ గుయో.. సూర్యకాంతితో నీటిని శుద్ధి చేసే ప్రయోగాలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ హైడ్రోజెల్స్‌ను కనుగొన్నాడని, ఈ ప్రాజెక్టుకు సహ-నాయకత్వం వహించిన కెమికల్ ఇంజనీరింగ్‌ మెక్ కెట్టా విభాగంలోని ప్రొఫెసర్ కీత్ జాన్‌స్టోన్ తెలిపారు. ప్రస్తుతం ఈ బృందం హైడ్రోజెల్స్‌ను మెరుగుపరచడానికి పనిచేస్తోంది. కాగా, వీటిని తయారు చేసేందుకు అవసరమైన మెటీరియల్స్ చవకైనవి కావడంతోపాటు సంశ్లేషణ ప్రక్రియ(సింథసిస్ ప్రాసెస్)లు కూడా సరళమైనవని తెలిపారు.


Next Story

Most Viewed