SBI : 80 శాతం లాభాలు సాధించిన ఎస్‌బీఐ!

by  |
SBI : 80 శాతం లాభాలు సాధించిన ఎస్‌బీఐ!
X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారీ లాభాలను వెల్లడించింది. చివరి త్రైమాసికంలో బ్యాంకు నికర లాభాలు 80 శాతం పెరిగి రూ. 6,451 కోట్లకు చేరుకున్నట్టు తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ. 3,581 కోట్ల లాభాలను నమోదు చేసింది. వార్షిక ప్రాతిపదికన బ్యాడ్ లోన్స్ కేటాయింపు తగ్గినందువల్లే అధిక లాభాలను ఎస్‌బీఐ నమోదు చేసినట్టు విశ్లేషకులు తెలిపారు. గతేడాది బ్యాడ్ లోన్స్ కేటాయింపు రూ. 11,840 కోట్ల నుంచి రూ. 9,914 కోట్లకు క్షీణించినట్టు బ్యాంకు తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో ఎస్‌బీఐ వడ్డీ ఆదాయం 19 శాతం పెరిగి రూ. 27,067 కోట్లుగా ఉండగా, గతేడాది ఇదే త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ. 22,767 కోటుగా ఉన్నట్టు తెలిపింది. మార్చి త్రైమాసికంలో ఎస్‌బీఐ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. మొత్తం స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 4.98 శాతానికి చేరుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో 6.15 శాతంగా ఉంది. నికర ఎన్‌పీఏలు 1.5 శాతంగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 4 డివిడెండ్‌ను ప్రకటించింది. కాగా, ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్ ధర శుక్రవారం 5 శాతం మేర లాభపడి రూ. 403 వద్ద ట్రేడయింది.
Next Story

Most Viewed