దేశీయ స్టార్టప్ 'క్యాష్‌ఫ్రీ'లో ఎస్‌బీఐ పెట్టుబడులు..

by  |
దేశీయ స్టార్టప్ క్యాష్‌ఫ్రీలో ఎస్‌బీఐ పెట్టుబడులు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ప్రముఖ పేమెంట్ సొల్యూషన్స్ స్టార్టప్ సంస్థ క్యాష్‌ఫ్రీలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. గతేడాది క్యాష్‌ఫ్రీ కంపెనీ రూ. 250 కోట్ల నిధులను సేకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్యాష్‌ఫ్రీ కంపెనీ విలువ సుమారు రూ. 1,500 కోట్లుగా ఉంది. అయితే, దేశీయ స్టార్టప్ సంస్థలో ఎస్‌బీఐ ఇన్వెస్ట్‌మెంట్‌కు సంబంధించి అధికారికంగా వెల్లడి కాలేదు. నైకా, జొమాటో, క్రెడ్, షెల్ వంటి సంస్థలు క్యాష్‌ఫ్రీ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ను చెల్లింపుల కోసం వినియోగిస్తున్నాయి. ఇవి కాకుండా షియోమి, టెన్సెంట్, క్లబ్ ఫ్యాక్టరీ, డన్‌జోతో పాటు మిలాప్ లాంటి ప్లాట్‌ఫామ్‌లు ఈ కంపెనీ సేవలను పొందుతున్నాయి.

దేశీయ విశ్వసనీయ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐతో భాగస్వామ్యం కోసం ఉత్సాహంగా ఉన్నట్టు క్యాష్‌ఫ్రీ తెలిపింది. ‘వినియోగదారుల అనుభవం, ప్రొడక్ట్ ఇన్నోవేషన్‌పై తాము దృష్టి సారించడం ద్వారా పెట్టుబడుల సేకరణ కొనసాగిస్తామని’ క్యాష్‌ఫ్రీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాష్ సిన్హా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, డిజిటల్ చెల్లింపుల సంస్థగా క్యాష్‌ఫ్రీ 2015లో ప్రారంభమైంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యెస్ బ్యాంక్ లాంటి బ్యాంకులతో ప్రధాన చెల్లింపులు, బ్యాంకింగ్ మౌలిక సదుపాయాలను అందిస్తోంది.



Next Story

Most Viewed