ప్రశాంతంగా హుజూరాబాద్ ఎన్నికలు

by  |
ప్రశాంతంగా హుజూరాబాద్ ఎన్నికలు
X

దిశ. హుజురాబాద్, జమ్మికుంట: హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతున్నాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు. శనివారం హుజురాబాద్, జమ్మికుంటలో పోలింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఈఓ మీడియాతొ మాట్లాడుతూ… హుజురాబాద్ నియోజకవర్గంలోని 306 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో హెల్ప్, హెల్త్ డెస్క్ లు ఏర్పాటు చేశామన్నారు. మాస్కులు లేకుండా వచ్చే ఓటర్లకు హెల్త్ డెస్క్ లో మాస్కులు అందచేస్తున్నారని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

మధ్యాహ్నం ఒంటిగంట వరకు 45 శాతం ఓటింగ్ జరిగిందని, సాయంత్రం 7 గంటల వరకు ఇంకా ఎక్కువ మొత్తంలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఎన్నికలకు సంబంధించి హుజూరాబాద్ నియోజకవర్గంలో 20 కంపెనీల కేంద్ర పోలీస్ బలగాలను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహిస్తున్నామని వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు వచ్చే ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ కు ముందు రోజు వరకు 3.50 కోట్ల నగదు, 1075 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆయన వెంట సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి రవి కిరణ్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లు ఉన్నారు.



Next Story

Most Viewed