ఇసుక రవాణా.. ఇస్కో పక్‌డో!

by  |
ఇసుక రవాణా.. ఇస్కో పక్‌డో!
X

దిశ, మహబూబ్‌నగర్: లాక్‌డౌన్ ఉన్నా సరే.. నిబంధనలు విధించినా సరే.. ఇసుకాసురుల దారి ఇసుకాసురులదే. కాసుల మీదే వారి కక్కుర్తి. కరోనా భయమేమి పట్టదువారికి. కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ కొందరు అక్రమార్కులు పాలమూరు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. అయితే, ఈ ఇసుక దందాకు నాయకుల అండదండాలున్నాయనీ, అధికారులకు మామూళ్లు అందుతున్నాయని అందుకే వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 20 రోజులుగా ఇసుక అక్రమ రవాణా చేసే వారి సంఖ్యతోపాటు వారి ఆదాయం రెట్టింపయింది. లాక్‌డౌన్ కారణంగా ఎక్కడ చూసినా నిర్మానుష్యంగా ఉండటంతోపాటు అధికారులు కరోనా డ్యూటీల్లో ఉన్నారు. దీంతో ఇదే అదనుగా భావించిన అక్రమార్కులు కృష్ణానది పరీవాహక ప్రాంతం సహా జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు.

నాయకుల అండదండలతోనే..

జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం విషయానికి వస్తే ఈ ప్రాంతానికి చెందిన ఓ బడా నాయకుడి అండదండలతో, నారాయణపేట జిల్లా నుంచి కీలక పదవిలో ఉన్న నాయకురాలి భర్త కనుసన్నల్లో ఈ ఇసుక వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ ప్రాంతానికి చెందిన నర్వ, మాగనూర్ మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. చిట్యాల ప్రాంతానికి చెందిన మరో కీలక నాయకుడు, చాలా కాలంగా మక్తల్ బడా నేతకు ప్రధాన అనుచరునిగా మెలుగుతూ ఇటీవల ఉమ్మడి జిల్లా కీలక పదవిని కూడా చేపట్టారు. ప్రస్తుతం ఆయనా తన కనుసన్నల్లో మాగనూర్, అనుగొండ గ్రామాల అక్కడి స్థానిక ప్రజాప్రతినిధుల అండతో ఇసుకను డంప్ చేస్తున్నారు. అందరూ అధికార పార్టీ నాయకులే కావడంతోపాటు కీలక పదవులలో కొనసాగుతుండటంతో క్ష్రేత్ర స్థాయి సిబ్బంది అంతా తెలిసినా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. రెవెన్యూ, పోలీసు శాఖ సిబ్బంది అందరికీ నెలనెలా వాటాలు వీరి నుంచి అందుతున్నాయని సమాచారం.

రోజూ రాత్రి వేళ్లల్లో హైదరాబాద్‌కు…

రోజూ రాత్రి వేళ్లల్లో హైదరాబాద్ నగరానికి సుమారు 10 లారీలతో, సుమారు 30 ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. లారీ ఇసుకకు రూ.60 వేల వరకు అదాయం వస్తుండగా ట్రాక్టర్‌కు రూ.5 వేల వరకు వస్తోంది. నడిగడ్డ ప్రాంతానికి చెందిన మరో బడా నాయకుడు ఆయన, తన అనుచరగణాన్ని ముందుపెట్టి రోజూ 10 లారీలతో ఇసుకను తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలంపూర్ సరిహద్దు ప్రాంతాలలోని నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఈ ఇసుకను తరలిస్తున్నారు. ఆయనకు రోజూవారీ ఆదాయం రూ.3 నుంచి లక్షలకుపైగానే ఉంటుందని అంచనా. ఈ ప్రాంతంలో మరెవరైనా ఇసుక దందా చేయాలంటే సదరు నాయకునికి నెలనెలా మమూళ్లూ ఇవాల్సిందే అని హుకుం జారీ చేసినట్లు సమాచారం. తనకు తెలియకుండా ఎవరైనా ఇసుక క్వారీల వైపు వెళ్తే వెంటనే సదరు నాయకుడు అధికారుల చేత దాడులు చేపించి వాహనాలు జప్తు చేస్తున్నారని తెలుస్తోంది. దేశంలోనే డార్క్ మండలంగా పిలవబడే మిడ్జిల్ మండలంలోనూ ఇసుక తరలింపు విచ్చలవిడిగా సాగుతుంది. ఏడాదిలో తక్కువ వర్షపాతం నమోదు అవుతుండటంతో ఈ మండలాన్ని డార్క్ మండలంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి పోయాయి.

వాగును కబ్జా చేసి…

ఇక్కడి రైతులు సుమారు 600 నుంచి 700 అడుగుల లోతు బోరు వేస్తే కానీ నీరు వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రభుత్వం ఈ మండలం నుంచి ప్రవహిస్తున్న దుందుబి వాగు నుంచి ఇసుక తరలింపునకు టెండర్లను పిలించింది. ఆ టెండరును ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఓ బడా నాయకుని నియోజకవర్గానికి చెందిన వ్యక్తి దక్కించుకున్నారు. ఈ వాగు పరిసర ప్రాంతాల్లో కొంత భూమిని కొనుగోలు చేసిన సదరు గుత్తేదారు ఏకంగా వాగునూ కబ్జా చేసి ఇష్టానుసారంగా వాగులో తవ్వకాలు చేపట్టి ఇసుకను తరలిస్తున్నారు. ప్రస్తతం ఈ ప్రాంతం అంతా పెద్ద పెద్ద గొయ్యిలు దర్శనమిస్తున్నాయి. అయినా స్పందించాల్సిన అధికారులు స్పందించడం లేదు. అటువైపు వెళ్లడానికి వెళ్లడానికి భయపడుతున్నారు. అటువైపు కన్నెత్తి చూసినా జిల్లా అధికారుల నుంచి లేదా బడా నాయకుల నుంచి ఫోన్లు రావడంతోపాటు హెచ్చరికలు వస్తాయి. దీంతో తమకెందుకు వచ్చిన తంటా అనుకుంటూ అధికారులు అంతా చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఇసుక రవాణా ప్రణాళిక ప్రకారం రాత్రి వేళల్లో హైదరాబాద్‌కు నేరుగా జాతీయ రహదారి మీదుగానే తరలిస్తున్నారు. ముందుగా ఒక వాహనం వెళ్తూ వెనుక వచ్చే వాహనాలకు సంకేతాలు ఇస్తోంది. ఒక్కో లారీ మద్య సుమారు 3 కిలోమీటర్ల దూరం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇసుక తరలింపు అంతా ఇలా ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోంది. ఎప్పటికపుడు జాతీయ రహదారి పై పరిస్థితులను నాయకుల అనుచరులు గమనిస్తూనే ఉంటారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే వాహనాలను పక్కదారి పట్టించి నిలిపేస్తారు. ఈ సందర్భంలో జాతీయ రహదారి పొడవున ఉన్న పోలీస్ స్టేషన్లకూ నెలవారి మామూళ్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇసుక కృత్రిమ తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వివిధ గ్రామ శివారుల్లో ఉన్న వాగుల వద్ద ఈ కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో కొనసాగిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేల వరకు విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నా అడిగే నాథుడు కరువయ్యాడు. జిల్లాలో ఇంత యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతుంటే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడం తగదనీ, తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు.

Tags: Illegal, sand, transportation, lockdown, rules, break, covid 19 effect



Next Story

Most Viewed