ఇండియాలో భారీగా ఉద్యోగులను నియమించుకోనున్న శాంసంగ్..

by  |
samsung
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి తర్వాత పరిస్థితులు సానుకూలంగా మారుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజం శాంసంగ్ ఇండియా క్యాంపస్ నియామకాలను చేపట్టనున్నట్టు వెల్లడించింది. మొత్తం 1,000 మంది ఉద్యోగులను తీసుకోనున్నట్టు కంపెనీ పేర్కొంది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన మూడు ఆర్అండ్‌డీ కేంద్రాల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ), క్లౌడ్ టెక్నాలజీ, డేటా, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), డీప్ లెర్నింగ్, నెట్‌వర్క్, కెమెరా టెక్నాలజీ, ఇమేజ్ ప్రాసెసింగ్ వంటి విభాగాల్లో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది.

భారత్‌లో శాంసంగ్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. కొరియా తర్వాత ఇక్కడే అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రాలున్నాయి. గత కొన్నేళ్లుగా దేశీయంగా వేగవంతమైన ఆవిష్కరణలకు కేంద్రంగా ఉంది. అంతేకాకుండా భవిష్యత్తులో అవసరమైన పరిష్కారాల ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ ఏడాది భారత్‌లో వెయ్యి మంది ఇంజనీర్లను నియమించాలని నిర్ణయించాం. దేశీయంగా ఐఐటీ, దిగ్గజ ఇంజనీరింగ్ కాలేజీల నుంచి వీరిని రిక్రూట్ చేయనున్నామని’ శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్-ప్రెసిడెంట్ సమీర్ వాధవన్ చెప్పారు.

కాగా, శాంసంగ్ ఇండియా 2019లో మొత్తం 1,200 మంది ఇంజనీర్లను నియమించుకుంది. కరోనా కారణంగా వీరిలో కొందరు ఆలస్యంగా చేరగా, మరికొందరు 2021లో చేరారని కంపెనీ వెల్లడించింది.

Next Story

Most Viewed