నిద్రమత్తులో ఆర్టీసీ అధికారులు.. నిలువు దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా బస్టాండ్

by  |
నిద్రమత్తులో ఆర్టీసీ అధికారులు.. నిలువు దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా బస్టాండ్
X

దిశ, కరీంనగర్ సిటీ : ప్రయాణీకుల నిలువుదోపిడీకి కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నది. అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు.. ప్రయాణీకుల వద్ద అందినకాడికి దండుకుంటున్నారు. అడిగిందే తడవు.. అసలును పోలిన నకిలీ వస్తువులు అంటగడుతూ, MRP రేటును మించి వసూలు చేస్తున్నారు.

లాక్‌డౌన్ కారణంగా మధ్యాహ్నం వరకే బస్సులు నడుస్తుండగా, ప్రయాణం తొందరలో అత్యధిక మంది దుకాణదారులు అడిగినంతా చెల్లించి వెళ్తుండగా, మరికొందరు ప్రశ్నిస్తే వారికి చుక్కలు చూపిస్తున్నారు. దుకాణదారులంతా సిండికేటుగా మారి.. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో అత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు కూడా ప్రయాణీకులు జంకుతున్నారు. వారిని అదుపులో పెట్టాల్సిన ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. ఫిర్యాదు చేసినా కూడా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఉత్తర తెలంగాణలో అతి పెద్దదిగా పేరుగాంచిన కరీంనగర్ బస్టాండ్ వ్యాపారులకు వరప్రదాయిని కాగా, ప్రయాణీకుల పాలిట శాపంగా మారింది. అసలును పోలిన నకిలీ వస్తువులను అంటగడుతూ, వారిని అనారోగ్యాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాగే నీటి నుంచి మొదలు ఏ తినుబండారము విక్రయించినా, నాణ్యతకు తిలోదాకాలు ఇవ్వడమే తప్ప, కొనుగోలుదారుల ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపాన పోవటంలేదని పలువురు మండిపడుతున్నారు. కిన్లీ, బిస్లరీ, ఆక్సరిచ్ వాటర్ బాటిల్స్ లాంటి పేరొందిన కంపెనీలను పోలి ఉండే పేర్లతో బస్టాండ్‌లోనే బోరు నీటితో బాటిల్స్ నింపి, MRP ధరలను మించి విక్రయిస్తున్నారు.

నాసిరకం బిస్కెట్లు, కల్తీ నూనెలతో చేసిన తినుబండారాలు అమ్ముతున్నారు. అసలే కరోనా విజృంభిస్తున్న తరుణంలో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం కొనసాగించాల్సి ఉండగా.. ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతున్నా పట్టించుకునే వారే లేరని ప్రమాణీకులు మండిపడుతున్నారు. నిత్యం 10 నుంచి 15 వేల మంది రాక పోకలు కొనసాగించే ఈ ప్రయాణ ప్రాంగణంలో, కల్తీ వస్తువులు, నాసిరకం తినుబండారాలు అమ్మే వారిపట్ల ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ.. దాడులు నిర్వహించాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉన్నారనే ఆరోపణలున్నాయి.

ప్రయాణీకుల నుంచి ఫిర్యాదులు వచ్చినా పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తున్నారని, పదే పదే గుర్తు చేసినా నామ మాత్రపు తనిఖీలు చేస్తూ, చేతులు దులుపుకుంటున్నారని, విధిలేక కొనుగోలు చేస్తే తాము రోగాల బారిన పడుతున్నామని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా, అధికారులు స్పందించి నాణ్యత లేని వస్తువుల విక్రయాలను అరికట్టాలని ప్రయాణీకులు కోరుతున్నారు.

బస్ స్టాండ్ దుకాణాల్లో ఏది కొన్నా ధరలు ఎక్కువే..

రాజు, ప్రయాణీకుడు..

అనేక పనుల నిమిత్తం వారంలో మూడు రోజులు ప్రయాణం చేస్తుంటా. మంచి నీళ్ళు కొన్నా, బిస్కెట్ పాకెట్ కొన్నా ధరలు మండిపోతున్నాయి. 20 గజాల దూరానికి రెండింతల తేడా ఉంటుంది. ప్రశ్నిస్తే నాపైనే దాడి చేసే ప్రయత్నం చేశారు. బస్ స్టాండ్ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.


Next Story

Most Viewed