సబితా.. ఇక్కడ అడుగు పెట్టగలవా?

by  |
Almas Gooda
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆ మంత్రి నియోజకవర్గానికి వచ్చారంటే చాలు.. రూ.కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు వేయనిదే తిరిగి ఇంటికి వెళ్లరు. కాకపోతే ఆ పనులెంత వరకు అయ్యాయని మాత్రం ఆమె పట్టించుకోరు. తాను మందీమార్బలం, కార్యకర్తలు, అధికారుల గుంపుతో వచ్చి ఆర్భాటంగా వచ్చి శంకుస్థాపన చేశామా? లేదా? కాలనీవాళ్లంతా వచ్చారా? ప్రభుత్వం చేపట్టిన పథకాలను, అభివృద్ధి పనులను ఏకరవు పెట్టామా.. పత్రికల్లో కవరేజ్​బాగా వచ్చిందా? లేదా? ఇంత వరకే వారి బాధ్యత. ఆ సందర్భంలో ఆమె ఇచ్చిన హామీలేవీ మళ్లీ గుర్తుకు రావు.

8 నెలలుగా వందలాది కుటుంబాలను మురుగు దిగ్బంధనం చేసింది. కాలు తీసి బయట పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. అదేమీ వారి కాలనీ డ్రైనేజీ పొంగిపొర్లితే తలెత్తిన ఇబ్బంది కాదు. పైనున్న చెరువులు, కాలనీల నుంచి వస్తోన్న మురుగే. కాలనీవాసులెవరూ ఆక్రమణలకు పాల్పడలేదు. డ్రైనేజీ పైపులైన్లను ధ్వంసం చేయలేదు. కానీ సరైన మార్గం ఏర్పాటు చేయని పాలకులు, అధికారుల పాపం వల్ల తలెత్తిన సమస్య. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న బడంగ్​పేట కార్పొరేషన్​పరిధి అల్మాస్​గూడలోని బోయపల్లి ఎన్ క్లేవ్​కాలనీ దయనీయమైన పరిస్థితి.

Slum Area

గతేడాది కురిసిన భారీ వర్షాల సమయంలో మొదలైన సమస్యకు ఇప్పటి వరకు పరిష్కారం చూపలేదు. కార్పొరేటర్లు, గల్లీ లీడర్లు, స్థానిక టీఆర్ఎస్ ​నాయకులు.. ఆఖరికి మంత్రి సబితారెడ్డి అందరు వచ్చారు.. చూశారు. వెళ్లారు. ఆ కాలనీవాసుల పరిస్థితి చూసి ఎంత కష్టమొచ్చిందని ఓదార్చారు. కానీ ఏ ఒక్కరూ శాశ్వత పరిష్కారానికి మాత్రం ముందుకు రాలేదు. తామంతా ఆస్తి పన్నులు కడుతున్నాం. ఇంటి నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నాం. అప్పుడూ ఫీజులు చెల్లించాం. అలాంటప్పుడు మా కాలనీ సమస్యను పరిష్కరించేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకటీ, రెండు సార్లు కాదు.. ప్రతి రోజూ కాలనీవాసులు తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండంటూ అందరికి మొర పెట్టకుంటూనే ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ దయ చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దుర్గంధంతో రోగాలు

వందలాది కాలనీల డ్రైనేజీ ఆ కాలనీ మీదుగానే వెళ్తుంది. రోడ్ల వెంబడే ప్రవహిస్తోంది. ఆ దుర్గంధంతో భరించలేకపోతున్నారు. ఒక్క పూట కాదు.. ఒక్క రోజు కాదు. 8 నెలలుగా ఈ డ్రైనేజీని భరించలేకపోతున్నామని బోయపల్లి ఎన్​క్లేవ్​వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలనీ నుంచి మెయిన్​రోడ్డు మీదికి కూడా వెళ్లలేని పరిస్థితి. ఎవరైనా బయటికి వెళ్లాలంటే కారులో మాత్రమే సాధ్యం. అది కూడా ఎక్కడ ఇరుక్కుపోతుందో తెలియదు. ప్రతి రోజూ నాలుగైదు ఆటోలు, కార్లు దిగబడుతున్నాయి. ఆఖరికి తమ కాలనీకి గ్యాస్​సిలిండర్ల ఆటోల వాళ్లు కూడా రాలేమంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఆ మురుగులో జారి పడ్డారు. ఎన్నో వాహనాలు జారడంతో దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలయ్యారు. వృద్ధులు, పిల్లలు మెయిన్​రోడ్డు మీదికి వెళ్లక 8 నెలలు గడుస్తోంది. ఎక్కడికైనా వెళ్లాలంటే క్యాబ్​బుక్​చేసుకోవాలి. వాళ్లేమో కాలనీ మొదటి దాకా వచ్చి ఆ తర్వాత రాలేమంటూ బుకింగ్‌ను క్యాన్సిల్​చేసుకుంటున్నారు. అక్కడి దాకా వెళ్దామంటే వీల్లేని పరిస్థితి. దీంతో మెడికల్​ చెకప్‌లను కూడా వాయిదా వేసుకున్న వృద్ధులు ఉన్నారు.

Drainage

కనీసం ఆన్‌లైన్‌లో ఆర్డర్​ ఇచ్చినా డెలివరీకి ససేమిరా అంటున్నారు. ఇలాంటి దుస్థితిలో ఎలా నివాసం ఉండాలని ప్రశ్నిస్తున్నారు. మంత్రి సబితారెడ్డి ఇలాఖాలో ఉన్నందుకు గర్వించాలో, ఏడ్వాలో తెలియడం లేదంటున్నారు. ఇప్పటికే కొందరు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇండ్లకు వెళ్లారు. తమ కాలనీలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు ఒక్క గంట సేపు గడిపితే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుందంటున్నారు. అందుకే మంత్రితో సహా అందరూ తమ కాలనీకి రావాలని ఆహ్వానిస్తున్నట్లు పలువురు కాలనీవాసులు తెలిపారు. ఈ మురుగు దిగ్బంధనం నుంచి తమకు విముక్తి కల్పించకపోతే అంటురోగాలతో చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తమను మురుగు నుంచి రక్షించాలని మంత్రులు సబితారెడ్డి, కేటీఆర్‌లను వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed