భారత్ బయట తొలి రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్

by  |
భారత్ బయట తొలి రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ద్విచక్ర వాహనాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న గుర్తింపు ప్రత్యేకం. ఏళ్లు గడుస్తున్నా, ఎన్ని కొత్త స్టైల్ బైక్‌లు వస్తున్నప్పటికీ తనకంటూ ప్రత్యేకతను దక్కించుకుంది ఈ బైక్. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఆదరణను కలిగి ఉంది. సుమారు 50 దేశాల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది.

సుమారు 119 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకూ రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత్‌కు బయట ప్రత్యేకంగా ఉత్పత్తి ప్లాంట్‌ను మొదలుపెట్టలేదు. అయితే, తాజాగా అర్జెంటినాలో స్థానిక సంస్థ భాగస్వామ్యంతో మోటర్‌సైకిల్ అసెంబ్లింగ్‌తో పాటు ఉత్పత్తి యూనిట్‌ను ప్రారంభించింది. ఇదివరకు అర్జెంటినాలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు స్థానిక పంపిణీదారుగా ఉన్న గ్రుపో సింపా కంపెనీ (Grupo Simpa company) ఈ ఉత్పత్తిని నిర్వహించనుంది.

అర్జెంటినా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ చరిత్రలో మొట్టమొదటి సారిగా చెన్నై ప్లాంట్ తర్వాత వాహనాల అసెంబ్లింగ్, ఉత్పత్తిని జరుపుతున్నట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, 2018లో అర్జెంటినా ద్విచక్ర వాహనాల వ్యాపారంలోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రవేశించింది. గ్రుపో సింపా సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్‌సెప్టార్ 650 (Interceptor 650), హిమాలయన్ (Himalayan), కాంటినెంటల్ జీటీ 650 (Continental GT 650) మోడళ్లను ఉత్పత్తి చేసి, అసెంబ్లింగ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది.

ఈ నెలలోనే ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు, కంపెనీ వ్యాపార విస్తరణలో భాగంగానే అర్జెంటినాలో ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించామని రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈవో వినోద్ దాసరి చెప్పారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ను బట్టి మరిన్ని అసెంబ్లింగ్ యూనిట్లను ప్రారంభించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆస్ట్రేలియా, బ్రెజిల్, కొలంబియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, యుకె, మెక్సికో, న్యూజిలాండ్ ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రవేశించాలని కంపెనీ భావిస్తోంది.



Next Story

Most Viewed