నగరశివారులో భయంకర నిజాలు.. కస్టమర్లకు కుళ్లిపోయిన మాంసం

by  |
నగరశివారులో భయంకర నిజాలు.. కస్టమర్లకు కుళ్లిపోయిన మాంసం
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: నగరశివార్లలోని పెద్ద పెద్ద హోటళ్లలో కుళ్లిపోయిన మాంసం వడ్డిస్తున్నారు. తుర్కయంజాల్‌, పెద్ద అంబ‌ర్‌పేట‌, అబ్దుల్లాపూర్‌మెట్ వంటి న‌గ‌ర శివారులో ప్రాంతాల్లో హోట‌ళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. రియ‌ల్ ఎస్టేట్ రంగం ఊపుమీద ఉండ‌టం, శివారు ప్రాంతం కావ‌డంతో ఈ ప్రాంతాల్లో సాధార‌ణంగా జ‌నాల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. హోట‌ళ్లు, రెస్టారెంట్లు వంటివి ఎప్పుడూ క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటాయి. జ‌నాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆహార ప‌దార్థాలు అందించాల‌న్నదే ధ్యేయంగా మాంసం, సీ ఫుడ్ వంటివి నిల్వ చేస్తున్నారు. పండుగ‌లు, సెల‌వుల స‌మ‌యంలో జ‌నాలు రాన‌ప్పుడు మిగిలిన ప‌దార్థాల‌ను వారం, ప‌దిరోజుల పాటు కూడా నిల్వ చేసి, వ్యాపార లాభాలే ప‌ర‌మావ‌ధిగా, అవి కుళ్లినా స‌రే మ‌సాలాలు పట్టించి అమ్ముతూ… ప్రజ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు.

తుర్కయాంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలో వారంరోజులుగా అధికారులు నిర్వహిస్తున్న త‌నిఖీల్లో భ‌యంక‌ర నిజాలు వెలుగు చూశాయి. సాగ‌ర్ రోడ్డుపై ఉన్న రెండు పెద్ద హోట‌ళ్లలో ఇటీవ‌ల చేసిన త‌నిఖీల్లో కుళ్లిన మాంసం, రొయ్యలు, గోంగూర చెట్నీ బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌న్నెగూడ‌లో ఓ హోటల్‌లో మున్సిప‌ల్ అధికారులు ఆక‌స్మికంగా నిర్వహించిన త‌నిఖీల్లో ఫ్రిజ్‌లో బూజుప‌ట్టిన మాంసం, చెట్నీలు, పురుగులు ప‌ట్టిన చికెన్‌, రొయ్యలు బ‌య‌ట‌ప‌డ్డాయి. రోజుల తరబడి నిల్వ ఉంచ‌డంతో గబ్బు వాస‌న ప‌ట్టింది. ఇదే మాంసాన్ని వినియోగ‌దారుల‌కు వండి పెడుతూ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ప్రజ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్న ఆ య‌జ‌మానికి భారీగా జ‌రిమానా విధించారు.

చర్యలు తప్పవు

మ‌న్నెగూడ‌లోని ఓ హోట‌ల్‌లో కుళ్లిన మాంసం బ‌య‌ట‌ప‌డింది. హోట‌ళ్లు, రెస్టారెంట్ల య‌జ‌మానులు ప్రజ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడొద్దు. నాణ్యతా ప్రమాణాలు పాటించ‌క‌పోతే జ‌రిమానాలు విధిస్తాం, సీజ్ చేస్తాం. హోట‌ళ్లలో ప్రతిరోజు శానిటేష‌న్ చేయాల్సిందే. -ఎంఎన్ఆర్ జ్యోతి, కమిషనర్, తుర్కయంజాల్.


Next Story

Most Viewed