నీళ్ల బాటిల్ అధిక ధరపై.. ఐదేళ్ల పోరాటం

by  |
నీళ్ల బాటిల్ అధిక ధరపై.. ఐదేళ్ల పోరాటం
X

దిశ, వెబ్‎డెస్క్ : థియేటర్లు, మాల్స్, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కొన్ని ఆహార పదార్థాల ధరలు చూస్తే ..మనం అవాక్కవుతుంటాం. బయట.. పది రూపాయలకు దొరికే పాప్‌కార్న్.. థియేటర్‌లో రూ.150, రూ.పదిహేను విలువ చేసే పఫ్‌.. పాతిక రూపాయలే పైన.. ఈ జాబితాకు అంతులేదు. ఇష్టమైనవాళ్లు అంతధర పెట్టి కొనుగోలు చేస్తే, మరికొందరు మాత్రం మనకెందుకేలా అని లైట్ తీసుకుంటారు. అహ్మదాబాద్‌కు చెందిన 67 ఏళ్ల రోహిత్ పాటిల్ మాత్రం దీన్ని సహించలేదు. రూ. 20 వాటర్ బాటిల్‌కు 164 రూపాయలు వసూలు చేసిన ఓ రెస్టారెంట్‌పై ఐదేళ్ల నుంచి న్యాయపోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించాడు.

రోహిత్ ఐదేళ్ల క్రితం.. తన స్నేహితులతో కలిసి అహ్మదాబాద్‌లోని ఎస్‌జీ హైవేలోని ఓ హో‌టల్‌కు వెళ్లాడు. తమకు నచ్చిన ఫుడ్‌తో పాటు ఓ వాటర్ బాటిల్ ఆర్డర్ ఇచ్చారు. తిన్న తర్వాత వచ్చిన బిల్‌ను చూసిన రోహిత్, వాటర్ బాటిల్‌కు రూ. 164 ఉండగా, తప్పుగా ప్రింట్ అయిందని భావించాడు. హోటల్ నిర్వాహకులను అడగ్గా, బాటిల్ ధర అంతే అని సమాధానమిచ్చారు. యాజమాన్యాన్ని నిలదీశాడు, వారితో వాదించాడు అయినా..ఫలితం మాత్రం శూన్యం. దాంతో రోహిత్ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించాడు. లీగల్ నోటిసులు అందుకున్న ఆ హోటల్, కేసును వాదించేందుకు తమ తరఫు న్యాయవాదిని కోర్టుకు పంపించింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు ఆ కేసును ఐదేళ్ల నుంచి వాయిదా వేస్తూ వచ్చింది. ఈ క్రమంలో రోహిత్ 28సార్లు కోర్టుకు హాజరయ్యాడు. ఓ వాటర్ బాటిల్ కోసం ఇంతా గొడవ, ఐదేళ్లు పోరాడటం వృథా అని ఎన్నడూ భావించలేదు.

ఓపికగా హియరింగ్‌కు హాజరవుతూ, తన వాయిస్‌ను వినిపిస్తూ వచ్చిన రోహిత్‌కు, ఈ నెల 5న అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎంఆర్‌పీ ధర కంటే అధికమొత్తంలో వసూలు చేయడం సబబు కాదని, రోహిత్‌ను వేదనకు గురిచేయడంతో పాటు ఇతర ఖర్చులకు రూ. 5,500 పరిహారంగా ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. ‘కోర్టు తీర్పుతో సంతృప్తి చెందాను. అయితే ఇదే నాతొలి కేసు కాదు, ఇప్పటికే నేను ఎన్నోకేసులు ఫైల్ చేశాను. మన జేబులను లూటీ చేసే హక్కు ఏ ఒక్క కంపెనీకి లేదు. నైతికంగా వ్యవహరించాల్సింది పోయి దోచుకుంటున్నాయి, ఇది ఎంతమాత్రం సహించే విషయం కాదు’ అని రోహిత్ పేర్కొన్నాడు.



Next Story

Most Viewed