హైదరాబాద్‌లో తొలిసారిగా రోబోటిక్‌ న్యూరోస‌ర్జ‌రీ

by  |
హైదరాబాద్‌లో తొలిసారిగా రోబోటిక్‌ న్యూరోస‌ర్జ‌రీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తొమ్మిదేళ్ల బాలుడి మెద‌డులో మూర్ఛ‌కు కార‌ణం క‌నుక్కోడానికి హైద‌రాబాద్ న‌గ‌రంలో తొలిసారిగా రోబోటిక్ న్యూరోస‌ర్జ‌రీ ప‌ద్ధ‌తిని ఉప‌యోగించారు. కిమ్స్ ఆసుప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ న్యూరోస‌ర్జ‌న్ డాక్ట‌ర్ మాన‌స్ పాణిగ్రాహి ఈ ఘ‌న‌త సాధించారు. ఇది న్యూరోస‌ర్జ‌రీలో అత్యాధునిక ప‌ద్ధ‌తి. ఇమేజ్ గైడెన్స్‌తో కూడిన రోబో న్యూరోస‌ర్జ‌రీలో వేగం, క‌చ్చిత‌త్వం సాధించ‌డానికి సాయప‌డుతుంది. రోబో సాయంతో ఇలా న్యూరోస‌ర్జ‌రీలు చేసే స‌దుపాయం ప్ర‌పంచంలోనే అతి కొద్ది న‌గ‌రాల్లో ఉంది.

భార‌త‌దేశంలో మూడు, నాలుగు న‌గ‌రాలలోనే ఇలాంటి రోబోటిక్ న్యూరోస‌ర్జ‌రీలు అందుబాటులో ఉన్నాయి. కిమ్స్‌ న్యూరోస‌ర్జ‌రీ డిపార్టుమెంటులో రోబోటిక్ ప‌ద్ధ‌తిని ఇటీవ‌లే ప్రారంభించారు. మూర్ఛ‌వ్యాధి శ‌స్త్రచికిత్స, స్టీరియోటాక్టిక్ గైడెడ్ బ్రెయిన్ ట్యూమ‌ర్ బ‌యాప్సీ, పార్కిన్స‌న్స్ డిసీజ్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేష‌న్‌), బ్రెయిన్ ట్యూమ‌ర్ స‌ర్జ‌రీల‌లో మెద‌డులోని కీల‌క‌, స‌మ‌స్యాత్మ‌క‌ ప్రాంతాల‌ను గుర్తించ‌డానికి రోబోటిక్ సిస్టం ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని సాయంతో న్యూరోస‌ర్జ‌న్లు మెద‌డును కొద్దిభాగం మాత్ర‌మే తెరిచి కూడా బ్రెయిన్ ట్యూమ‌ర్ స‌ర్జ‌రీలు చేయ‌గ‌ల‌రు. దీనితో రోగుల‌కు నొప్పి త‌క్కువ‌గా ఉండి, త్వ‌ర‌గా కోలుకుంటారు.

మూర్ఛ వ్యాధి నివారణ

బాలుడికి ఎన్ని ర‌కాల మందులు వాడినా మూర్ఛ‌వ్యాధి అస్స‌లు త‌గ్గ‌క‌పోవ‌డంతో కిమ్స్ ఆసుప‌త్రికి తీసుకొచ్చారు. రోజూ ఆరేడు సార్లు మూర్ఛ వ‌చ్చేది. పాఠ‌శాల‌కు కూడా వెళ్ల‌లేక‌పోయాడు. మిగిలిన శారీర‌క అభివృద్ధి సాధార‌ణంగానే ఉంది. ముందుగా అత‌డికి న్యూరాల‌జిస్టు, ఎపిలెప్టాల‌జిస్టు డాక్ట‌ర్ సీతా జ‌య‌ల‌క్ష్మి ఆధ్వ‌ర్యంలో మెద‌డు ఎంఆర్ఐ, వీడియో ఈఈజీ ప‌రీక్ష‌లు చేశారు.

స‌మ‌స్య తెలిసినా, అది ఎక్క‌డ మొద‌లైందో తెలుసుకోలేక‌పోయారు. ఇలాంటి రోగులకు మెద‌డులో ఎల‌క్ట్రోడ్‌లు అమ‌ర్చి మూర్ఛ‌కు కార‌ణం ఎక్క‌డుంతో తెలుసుకోవాలి. డాక్ట‌ర్ మాన‌స్ పాణిగ్రాహి ఆధ్వ‌ర్యంలో రోబోట్ సాయంతో మెద‌డులో ఎనిమిది ఎల‌క్ట్రోడ్‌ల‌ను ఏర్పాటు చేశారు. మెద‌డులోని విద్యుత్ క్రియాశీల‌త‌ను రికార్డు చేశారు. త‌ద్వారా మూర్ఛ‌వ్యాధి స‌రిగ్గా ఏ ప్రాంతం నుంచి మొద‌ల‌వుతోంతో గుర్తించ‌గ‌లిగారు. ఈ త‌ర‌హా శ‌స్త్రచికిత్స‌ల‌కు సాంకేతిక నైపుణ్యం కూడా చాలా అవ‌స‌రం. ఎల‌క్ట్రోడ్‌ల‌ను ఎక్క‌డ పెడ‌తార‌న్న‌ది చాలా ముఖ్యం. ఇందుకు రోబోటిక్ సిస్టం ఉప‌యోగ‌ప‌డుతుంది.

మూడున్నర గంటల్లోనే

గ‌తంలో ఇలాంటి చికిత్స‌ల‌కు ఏడు గంట‌ల స‌మ‌యం ప‌ట్టేది. ముందుగా లోక‌ల్ అన‌స్థీషియా ఇచ్చి త‌ల‌కు ఒక ఫ్రేము అమ‌ర్చి అప్పుడు సీటీ స్కాన్, ఎంఆర్ఐ చేయాలి. అందులో కొంత నొప్పి ఉంటుంది. ఆ త‌ర్వాత లెక్క‌లు వేసుకోడానికి మ‌ళ్లీ అన‌స్థీషియా ఇచ్చి మ‌రో ఫ్రేము అమ‌ర్చాలి. త‌ర్వాత శ‌స్త్రచికిత్స చేస్తారు. రోబోటిక్ ప‌ద్ధ‌తిలో శ‌స్త్రచికిత్స ప్రారంభం నుంచి అన‌స్థీషియా ఇస్తారు.

ఎలాంటి నొప్పి ఉండ‌దు. చికిత్స‌ స‌మ‌యం స‌గం త‌గ్గిపోతుంది. అద‌న‌పు ఖ‌ర్చు కూడా ఏమీ ఉండ‌దు. సంప్ర‌దాయంగా మెద‌డులో ఆరు, ఏడు ఫ్రేములు మాత్ర‌మే అమ‌ర్చ‌గ‌ల‌రు. రోబోటిక్ ప‌ద్ధ‌తిలో ఎన్ని కావాలంటే అన్నింటిని పెట్ట‌చ్చు. వీటి సాయంతో మూర్ఛ‌కు కార‌ణ‌మైన ప్రాంతాన్ని గుర్తిస్తారు. త‌ర్వాత ఆ భాగాన్ని ఉంచాలా, లేదా తీసేయాలా అన్న విష‌యాన్ని వైద్యులు నిర్ణ‌యిస్తారు. ఈ బాలుడి విష‌యంలో మూర్ఛ ఎక్క‌డి నుంచి మొద‌లవుతోందో క‌చ్చితంగా గుర్తించి, శ‌స్త్రచికిత్స‌కు సిద్ధం చేశారు. త‌ర్వాత ఆ బాలుడు పాఠ‌శాల‌కు వెళ్లి, రోజువారీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చు.


Next Story

Most Viewed