‘కరోనా’ విధుల్లో ఉన్నా మాకు గుర్తింపేది?

by  |
‘కరోనా’ విధుల్లో ఉన్నా మాకు గుర్తింపేది?
X

దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో ప్రజలకు తమ వంతు సేవలందిస్తున్నా తమను ప్రభుత్వం గుర్తించడం లేదని జిల్లా రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర సేవలనూ అందిస్తున్నామనీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అనేక అంశాలపై విధులు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్‌వోలు, వీఆర్ఏలు, వీఏవోలు ప్రజలకు సంక్షేమ పథకాలు, నిత్యావసరాలు అందేలా తగు చర్యలు తీసుకుంటున్నారు. అయినా ఇతర శాఖలతో సమానంగా గుర్తించకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాల్లో కోతలు విధించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. మండల స్థాయి, జిల్లా అధికారులతో పాటు గ్రామాలకు వచ్చే వైద్య సిబ్బందికి కావాల్సిన అన్నిరకాల సహాయ సహకారాలను రెవెన్యూ సిబ్బంది అందిస్తుందని అలాంటి సమయాల్లో తమపై చిన్నచూపు చూపడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

కోత నిరుత్సాహపర్చింది..

గ్రామాలకు వచ్చే అధికారులతో ప్రజలను సమన్వయం చేస్తూ వారి వెంట గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది పర్యటిస్తున్నారు. పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి తిరిగి స్వగ్రామాలకు తిరిగి వస్తున్న వారిని గుర్తించడంతో పాటు బియ్యం పంపిణీ చేస్తున్నారు. పట్టణాల్లో ఉండే రెవెన్యూ ఉద్యోగులు క్వారంటైన్ సెంటర్ల వద్ద విధులు నిర్వహిస్తున్నారు. భోజన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం అకాల వర్షం కారణంగా పంటనష్టపోయిన రైతులను గుర్తించి జరిగిన పంటనష్టం అంచనాలను తయారు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇతర శాఖల వారికి ప్రోత్సాహకాలు ఇచ్చి వారిని ప్రోత్సహించడం మంచిదే అయినా తమకు మాత్రం రావాల్సిన వేతనల్లో కోతలు విధించి తమను నిరుత్సాహపర్చడం సబబు కాదంటున్నారు. పూర్తి స్థాయి వేతనాలు అందకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: revenue dept staff, salary, cuttings, agitation, Incentives, covid 19 affect, lockdown



Next Story