బామ్మర్ది కోసం కేటీఆర్ చీకటి ఒప్పందం !

by  |
బామ్మర్ది కోసం కేటీఆర్ చీకటి ఒప్పందం !
X

– లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ కోసం అడ్డదారులు
– ఇంగ్రేడియంట్స్ అభివృద్ధి, ఉత్పత్తికి IICTతో డీల్ కుదిర్చారు
– అనుభవం లేని సంస్థకు ప్రయోజనం చేకూర్చారు
– బీజేపీ, టీఆర్ఎస్‌ లోపాయకారీ ఒప్పందం
– మోడీతో మాట్లాడుతా, పార్లమెంట్‌లో ప్రశ్నిస్తా
– కాంగ్రెస్ ఎంపీ రేవంత్

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ తన బామ్మర్ది పాకాల రాజేంద్ర ప్రసాద్‌కు చెందిన లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ కోసం కేంద్ర పెద్దలతో మాట్లాడి భారీ డీల్ కుదిర్చారని ఆరోపించారు. కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఇబ్బందులపాలవుతుంటే కేటీఆర్ మాత్రం స్వంత లాభం కోసం పాకులాడారని అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ 2007లో ఏర్పాటైతే 2018 ఏప్రిల్‌లో పాకాల రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్‌గా నియమితులయ్యారని, అప్పటి నుంచి కంపెనీ దశ మారిపోయి వెంటనే రూ.140 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఉత్పత్తి కోసం రూ.10 వేల కోట్ల ఒప్పందం కూడా జరిగిందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు పైకి కొట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నా వాటి మధ్య చీకటి ఒప్పందాలు, సంబంధాలు ఉన్నాయన్నారు. ఎలాంటి పూర్వానుభవం లేని ఈ కంపెనీకి మాత్రల తయారీకి ఎలా అనుమతి వచ్చిందని ప్రశ్నించారు. ఈ లొసుగును దృష్టిలో పెట్టుకునే థెరపివా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని సబ్సిడియరీ కంపెనీగా ఏర్పాటు చేసుకొని దానికున్న మెడికల్ ఇన్‌ఫ్రా అనుభవాన్ని చూపించి ఒప్పందాలు చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కరోనా నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌లో వాడే ఇంటర్మీడియట్స్/ఇంగ్రేడియెంట్స్‌కి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, భవిష్యత్‌లో కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరిగి, ఎక్కువ దేశాలకు ఎగుమతి జరుగుతుందన్నారు. ఈ మెడిసిన్‌కు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉండటమే గాక, కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీలో సదరు కంపెనీకి వాటా కూడా వస్తుందన్నారు. కేసీఆర్ రాయబారంతో కేటీఆర్ బామ్మర్దికి ఊహకందని ఆర్ధిక లబ్ధి చేకూర్చారని రేవంత్ ఆరోపించారు. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్‌ జరిగినప్పుడల్లా తాను అద్భుతమైన సలహాలు ఇస్తున్నానని కేసీఆర్ పైకి చెప్పుకుంటూ ఇలాంటి దోపిడీకి ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించారు. బంధువులు, కాంట్రాక్టర్లకు ఒప్పందాలు చేసే కార్యక్రమాలు నడుపుతూ కేంద్రం ప్యాకేజీలను అప్పనంగా కొట్టేయడానికి సీఎం కేసీఆర్ అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు.

అర్హత లేని సంస్థకు ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తి ఆర్డర్ ఎలా వచ్చిందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదన్నారు. ఈ ఒప్పందాన్ని చూస్తే బీజేపీ-టీఆర్ఎస్ అంతర్గత కుమ్మక్కు ఎంత లోతైనదో తెలిసిపోతుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దల వ్యాపారంలో ఆంతర్యం ఏమిటో చెప్పాలని నిలదీశారు. అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఏం అర్హత చూసి ఇచ్చిందో జవాబు చెప్పాలన్నారు. ప్రధానికి సైతం లేఖ రాస్తానని, పార్లమెంట్‌లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతామని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ సైంటిస్టూ కాదు, గతంలో ఎలాంటి ఫార్మా కంపెనీ నడిపిన అనుభవం కూడా లేదన్నారు. కరోనాతో ప్రజలందరీకి సమస్యలు వస్తే కేటీఆర్ ఫ్యామిలీకి మాత్రం కనకవర్షం కురుస్తోందని ఆరోపించారు. అర్హత లేని కంపెనీలతో ఒప్పందం ఎలా జరిగిందో అధికార బీజేపీ కూడా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటు బంధుత్వం పేరిట కేసీఆర్, కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడం సరికాదన్నారు. లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ వివరాలను మీడియాకు బహిర్గతం చేశారు.

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్, రోడ్ నెంబర్ 2‌లో ఉన్న లాక్సాయ్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ చాలా కంపెనీల్లో ఒకటని, కానీ ఇప్పుడు ఈ కంపెనీ ఏకంగా ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌కు అవసరమైన ఇంగ్రీయంట్స్/ ఇంటర్మీడియట్స్ అభివృద్ధి ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐఐసీటీతో భాగస్వామ్య సహకారం కుదుర్చుకుందన్నారు. ఇది తాను చెబుతున్న విషయం కాదని, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించిందని రేవంత్ పేర్కొన్నారు. ఈ కంపెనీకి మందుల తయారీలో పెద్దగా అనుభవం లేదని, సాధించిన విజయాలు కూడా ఏమీ లేనందున ఏ ప్రాతిపదికన ఈ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

tags: Congress, Revanth Reddy, Laxai Life Sciences, KTR, brother-in-law, BJP, Hydroxychloroquine



Next Story

Most Viewed