వర్షాకాలం.. హైదరాబాద్ ప్రజలు మళ్లీ మునగాల్సిందేనా?

by  |
rain in Hyderabad
X

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మహా నగరవాసులారా, తస్మాత్ జాగ్రత్త.. కరోనా వైరస్ భయం, లాక్‌డౌన్ కష్టాలకు తోడు మరో విపత్తు రానుంది. జీహెచ్ఎంసీ అధికారులు ఏ పని చేపట్టినా తొలుత ఆర్భాటం ఆ తర్వత అలసత్వం. ప్రతి వర్షాకాలంలో భారీ వర్షాలు నగరాన్ని ముంచేస్తున్నా.. అధికార యంత్రాంగం గుణపాఠం నేర్చుకోవటం లేదు. నాలాల పూడికతీత, విస్తరణ పనులు ఏడాది పొడువునా నిరంతరం చేపడుతామని మంత్రి కేటీఆర్ జారీ చేసిన ఆదేశాలు ఎక్కడ కూడా అమలు కావటం లేదు. పైగా ఈ సారి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే వచ్చి, భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసినా, కనీసం ఇప్పటికైనా మాన్ సూన్ ఏర్పాట్ల విషయాన్ని కనీసం ప్రభుత్వం, సంబంధిత అధికారులు గానీ ప్రస్తావించకపోవటం బాధ్యతరాహిత్యానికి నిదర్శనం. గత సంవత్సరం భారీ వర్షాలకు మునిగిన విధంగానే మరోసారి నగరం నీటమునిగే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఇదే జరిగితే గత సంవత్సరం మాదిరిగానే మళ్లీ బాధితులకు వరద సాయం అందించి సరిపెట్టాలని సర్కారు భావిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది.

rain in Hyderabad

నగరంలో నేటికీ.. నిజాం కాలంలో నిర్మించిన నాలాలు, వరద నీటి కాలువలే వర్షపు నీరు ప్రవహించేందుకు దిక్కవటం, క్రమంగా అవి కూడా కబ్జాల పాలు కావటంతో చిన్న పాటి వర్షానికే పలు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ప్రస్తుతం వీటి ద్వారా నగరంలో గంటకు 7 సెం.మీ.ల వర్షం కురిస్తే వచ్చే వరద నీటి ప్రవాహనికి మాత్రమే ఇవి తట్టుకోగలవు. ఇప్పటి వరకు నగరం నీటలో మునిగినపుడల్లా కనిష్టంగా పది సెం.మీ.లు గరిష్టంగా 22 సెం.మీ.లు అంతకు ఎక్కువే వర్షపాతం నమోదు కావటం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 7 సెం.మీ,ల కన్న తక్కువ వర్షపాతం నమోదైన చాలా సందర్భాలలోనూ పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కానీ అలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా చెరువులు, కుంటాల్లో నిర్మితమైన ప్రాంతాలున్నాయి. ఈ విషయాన్ని రెండు దశాబ్దాల కాలం క్రితం నగరాన్ని మొట్టమొదటి సారిగా వరదలు ముంచెత్తినపుడు అప్పటి ప్రభుత్వం నియమించిన కిర్లోస్కర్ కమిటీ కూడా తేల్చి చెప్పింది. అంతేగాక, ఈ వరదల భారీ నుంచి తప్పించుకోలాంటే నాలాల ఆధునీకరణ, వాటిపై వెలసిన ఆక్రమణల తొలగింపు, వాటి విస్తరణ చేపట్టడం ఒక్కటే మార్గమని కూడా తేల్చి చెప్పింది. కానీ నాటి నుంచి నేటివరకూ ఎన్నో ప్రభుత్వాలు మారినా, చివరకు స్వరాష్ట్రం ఏర్పడినా, వీటి పరిస్దితి మెరుగుపడలేదు కదా రోజురోజుకి నాలాలపై ఆక్రమణలు పెరుగుతూనే ఉన్నాయి.

rain in Hyderabad

ఈ క్రమంలో రెండేళ్ల క్రితం భారీ వర్షాలు కురిసి, కూకట్ పల్లి తదితర ప్రాంతాలు నీట మునిగినపుడు మరోసారి అధ్యయనం చేయించిన ప్రభుత్వం నాలాలపై ఆక్రమణల తొలగింపు, ఆధునీకరణ, వివ్తరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కానీ సర్కారుకు సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచే వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం కనీసం భారీ వర్షాలు కురిసినపుడు వరద నీరు నాలాల్లో ఉధృతంగా ప్రవహించే ప్రాంతాల్లో ప్రవాహనికి అడ్డంకులుగా మారిన బాటిల్ నెక్ ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో నాలాకిరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగిస్తే కనీసం వరద నీరు కొంత సజావుగా ప్రవహించి, ముంపు ముప్పు తీవ్రత తగ్గే అవకాశముందని భావించి, అందుకు అనుకూలమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలోని చిన్న, మధ్య, భారీ తరహా నాలాలు ప్రవహించే సుమారు 390 కి.మీ.లలో ప్రత్యేక అధ్యయనం చేసి, దాదాపు 230 ఆక్రమణలు బాటిల్ నెక్ ప్రాంతాల్లో ఉన్నట్లు సర్కారుకు నివేదికను పంపగా, వాటి తొలగింపు కోసం ప్రభుత్వం రూ.70 కోట్లను కూడా విడుదల చేసింది.

ఈ ఆక్రమణ దారులు మళ్లీ కోర్టులను ఆశ్రయించినా, న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా, ఈ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ముందుగానే కోర్టులో కెవిట్ వేయాలని కూడా ఆదేశించింది. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. వీటిని తొగించేందుకు వెళ్లిన అధికారులను అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మళ్లీ అడ్డుకున్నారు. ఆక్రమణల తొలగింపు విషయంలో ఎపుడూ సిబ్బంది, నిధుల లేమి కారణంగా చూపే అధికారులు కాస్త ధైర్యం చేసి ముందుకెళ్లినా, మళ్లీ పాత అడ్డంకులే ఎదురయ్యాయి. ఇలా వరుసగా నాలుగైదు ప్రాంతాల్లో అధికారులకు చుక్కెదురు కావటంతో వారు మౌనం వహించటంతో ఆక్రమణల తోలగింపు అంతటితోనే ఆగిపోయింది. వరద ప్రమాద నివారణ చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయి.

ఎవరి తప్పు.. బాధ్యులెవరు?

దాదాపుగా వర్షాకాలం ప్రారంభమయ్యే రోజులివి. సీజనేతర రోజుల్లోనే ఎపుడు భారీ వర్షాలు కురుస్తాయో తెలీని పరిస్థితులు. ఐఎండీ హెచ్చరించిన విధంగానే భారీ వర్షాలు కురిసి నగరం జల దిగ్బంధమై జరగరాని నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నది చర్చనీయమైంది. వరదలు, సంభవించి, నాలాల్లో పడి అమాయకులు ప్రాణాలు కొల్పోతే ఆ తప్పు ఎవరిదీ? అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో ఆక్రమణలు, వరద నివారణ చర్యల గురించి మాట్లాడే ప్రజాప్రతినిధులే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఆక్రమణల తొలగింపును క్షేత్ర స్థాయిలో అడ్డుకుంటున్న ఆనవాయితీ ఉన్నన్నీ రోజులు నగరాన్ని వదరల నుంచి ఎవరూ కాపాడలేరన్న వాదన ఉంది. ఆక్రమణల తొలగింపునకు సంబంధించి ఇప్పటి వరకు ఇలాగే జరుగుతూ వస్తోంది. సర్కారు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పరిశీలిస్తే తప్పా, ఈ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చేకూరదు.

Next Story

Most Viewed