మహిళల చేతులకు ఉన్నవి గాజులు కావు.. విష్ణు చక్రాలు

by  |
మహిళల చేతులకు ఉన్నవి గాజులు కావు.. విష్ణు చక్రాలు
X

దిశ, ఏపీ బ్యూరో: అమరావతి ఉద్యమంలో మహిళల పాత్ర అమోఘమని మాజీ కేంద్రమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు ఆమె సంఘీభావం తెలిపారు. ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద రేణుకా చౌదరికి కాంగ్రెస్ నేతలు..రైతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతులు దేశానికి వెన్నెముక అని అలాంటి రైతులను వైసీపీ ప్రభుత్వం కంటతడి పెట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోరాటంలో మహిళలు రాజీలేని పోరాటం చేస్తున్నారని కొనియాడారు.

మహిళల చేతులకు ఉన్నవి గాజులు కావని.. విష్ణు చక్రాలు అని చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో మహిళలు తమ ఓటుతో ఏపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో రైతులు రోడ్డెక్కే పరిస్థితులు తీసుకువచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు. అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. తానొక సైనికుడి కూతురునని దేశంలో ఎక్కడైనా పర్యటిస్తానని..తనకు భయం అంటే ఏమిటో తెలియదని ఆమె అన్నారు. ఇకపోతే సోమవారం ఉదయం 6గంటలకు తుళ్లూరు శిబిరం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే.


Next Story