లే అవుట్లకు స్వస్తి.. గజాల లెక్కన విక్రయం

by  |
లే అవుట్లకు స్వస్తి.. గజాల లెక్కన విక్రయం
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రియల్​వ్యాపారులు తమ రూట్​మార్చుకున్నారు. రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రియల్టర్లకు తలనొప్పిగా మారింది. లే అవుట్లకు స్వస్తి చెప్పి ఫాంహౌస్ లపై దృష్టి సారించారు. వ్యవసాయ భూమి కొనుగోలు చేసి వెంచర్లు, లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీ, విల్లాలు చేసి విక్రయాలు చేసేవారు. అయితే, ఎల్ఆర్ఎస్​పై క్లారిటీ లేకపోవడంతో రియల్ వ్యాపారులు ఫాం ల్యాండ్ పేరుతో స్థలాలు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో లేఅవుట్లు, వెంచర్లు చేయడం ఖర్చుతో కూడుకుంది. దీంతో గిట్టుబాటు కావడం లేదని గజాల స్థలాన్ని గుంటల్లోకి మార్చి రిజిస్ట్రేషన్ చేయడం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలోని శివారు ప్రాంతాల్లో రైతుల వద్ద అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి మూడు గుంటలకు తగ్గకుండా 360 గజాలు ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. గజం స్థలానికి ఓ రేటు నిర్ణయించి విక్రయాలు జరుపుతున్నారు. గుంటల్లో స్థలం విక్రయం చేయడంతో తక్కువ ధరకు వస్తుందని కొనుగోలుదారులు భ్రమపడి తీసుకుంటున్నారు.

మూడు గంటలకు తగ్గకుండా..

ఓ వ్యక్తికి వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేయాలంటే తక్కువలో తక్కువగా మూడు గుంటలకు తగ్గకుండా ఉండాలి. సాధారణంగా ఎలాంటి నిబంధన లేకుండా 5గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసే అధికారం తహసీల్దార్​కు ఉంది. అంతకంటే తక్కువైతే స్థానిక రిజిస్ట్రేషన్ అధికారితో లోపాయికారి ఒప్పందం చేసుకుని ధరణి వెబ్​సైట్ ద్వారా రిజిస్ట్రేషన్​కు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒక గుంట భూమికి 121 గజాలుగా లెక్కకట్టి సుమారుగా 3 గుంటల భూమికి తగ్గకుండా 363 గజాల స్థలంగా పరిగణించి విక్రయిస్తున్నారు. గజానికి రూ.2,500 నుంచి రూ.5 వేల వరకు ధర నిర్ణయించి విక్రయాలు జరుపుతున్నారు. మూడు, ఐదు, ఏడు, పది గుంటల భూమిగా చేసి వాటికి మధ్యమధ్యలో 30 ఫీట్ల రోడ్లను చేసి అమ్మకాలు చేస్తున్నారు. కొనుగోలు దారులు ఇష్టపడితే ఆ స్థలంలో మొక్కల పెంపకానికి ఆసక్తి చూపిస్తే ఆ విధంగా అభివృద్ధి చేసేందుకు రియల్ వ్యాపారులు ముందుకు వస్తున్నారు. సుమారుగా 15 ఎకరాలపైగా స్థలాలను కొనుగోలు విక్రయాల కోసం మార్కెట్​లో పెడుతున్నారు.

లే అవుట్ల ఖర్చు భరించలేకనే..

వ్యవసాయ భూమిని నివాసయోగ్య స్థలంగా మార్చేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో టౌన్​ప్లానింగ్, గ్రామ పంచాయతీల అనుమతితో ఇష్టానుసారంగా లేఅవుట్లు, వెంచర్లు ప్లాట్లుగా విక్రయించేవారు. ఇప్పుడు అలా చేయాలంటే రిజిస్ట్రేషన్ సమస్య ఉత్పనమవుతుంది. వ్యవసాయ భూమిని మొదటగా రెసిడెన్షియల్ స్థలంగా మార్పు చేయాలి. అప్పుడు ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యూలరైజేషన్ స్కీం) కు పన్ను చెల్లించాలి. ఆ తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఎల్ఆర్ఎస్ లేకుండా నేరుగా భూమిని విక్రయించే అధికారం లేకుండా నిబంధన విడుదల చేసింది. దీంతో రియల్ వ్యాపారులకు రిజిస్ట్రేషన్ తలనొప్పిగా మారింది. ఆ విధంగా రియల్ వ్యాపారం చేయలేమని గ్రహించి ప్లాట్లను ఫాంల్యాండ్​గా మార్చి విక్రయాలు కొనసాగిస్తున్నారు. దీంతోతో ఖర్చు లేకుండానే ఆదాయం వస్తుందని వ్యాపారులు అంటున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు, మహేశ్వరం, యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల,ఆమన్​గల్లు మండలాల పరిధిలోని ప్రధాన రహదారులకు అతి సమీపంలో ఉన్న వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫాంల్యాండ్​గా మార్చి విక్రయాలు జరుపుతున్నారు.


Next Story

Most Viewed