రేషన్ షాపులే కేంద్రంగా ‘మెగా’ దందా.. కోట్లలో వ్యాపారం కళ్లు మూసుకున్న సర్కార్

by  |
Ration Rice Scam
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడన్న ధీమాతో కొంతమంది అక్రమార్కులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా దందా సాగిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని దారి మళ్లించి సన్న బియ్యంగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఈ దందాను నిలువరించే వారు లేకుండా పోయారు.

రేషన్ షాపుల కేంద్రంగా..

రేషన్ బియ్యాన్ని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలే ఈ వ్యాపారానికి ప్రధాన కేంద్రాలుగా మారాయి. షాపుల ద్వారా లబ్ధిదారులకు అందించాల్సిన బియ్యాన్ని కొనుగోలు చేసి వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. రూ. 10 కిలో చొప్పున రేషన్ షాపుల్లో కార్డు దారులకు డబ్బులు చెల్లించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు దళారులు. ప్రతి నెల 15 తరువాత రేషన్ షాపుల నుండి కలెక్ట్ చేసుకునేందుకు వచ్చే దళారులు ఆయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌ను బట్టి కిలో బియ్యానికి రూ. 12 నుండి రూ. 14 వరకు చెల్లిస్తున్నారు. వీరు నేరుగా మిల్లర్లకు చేరవేసి కిలోకు రూ. 16 చొప్పున విక్రయిస్తున్నారు. ఆ బియ్యాన్ని పాలిష్ రైస్‌గా మార్చి మార్కెట్లో బ్రాండెడ్ మార్కు వేసి రూ. 40కి కిలో చొప్పున విక్రయిస్తున్నారు.

ఇటీవల కొన్ని ప్రాంతాల రేషన్ షాపులకు సన్న బియ్యం సరఫరా చేస్తుండటంతో ఈ దందా నిర్వహించే వారికి మరింత సులువుగా మారిందనే చెప్పాలి. నిత్యకృత్యంగా మారిన ఈ దందాను కట్టడి చేసేందుకు సివిల్ సప్లై అధికారులు కానీ, విజిలెన్స్ వింగ్ కానీ పట్టించుకోకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. కార్డు హోల్డర్సే అమ్ముకుంటున్నారని తామేం చేస్తామన్న సమాధానాలు వినిపిస్తున్న వారూ లేకపోలేదు.

నాడు హద్దులు దాటితే..

నిన్న మొన్నటి వరకు పొరుగునే ఉన్న మహారాష్ట్రకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం తరలిపోయేవి. మహారాష్ట్రలోని గోందియా, గడ్చిరోలి జిల్లా సిరొంచకు రాత్రి రాత్రే ఇక్కడి రేషన్ బియ్యాన్ని తరలించే వారు. అయితే, సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో అటుగా వెళ్లే బియ్యం రూటు మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్, సిరిసిల్ల, జమ్మికుంట, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, పరకాల, నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి తదితర ప్రాంతాలకు ఇక్కడి బియ్యం తరలిపోతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సీడీ బియ్యాన్ని స్థానికంగా ఉన్న కొంత మంది మిల్లర్లు కొనుగోలు చేస్తూ సన్న బియ్యంగా మార్చి వ్యాపారం సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

నూకలుగా మార్చి..

చట్టంలోని లొసుగులు కొంతమంది అక్రమ వ్యాపారులకు వరంగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం అయితే పట్టుకోవచ్చు కానీ నూకలను పట్టుకునే అవకాశం లేకపోవడం వీరికి లాభిస్తోంది. కొంతమంది కరీంనగర్ శివార్లలో అడ్డాలు పెట్టుకుని రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి వ్యాపారం చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా డెన్‌లు ఏర్పాటు చేసుకుని రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్టార్చ్ తయారీ, లిక్కర్ ఫ్యాక్టరీలకు అవసరమైన నూకలను మార్చి విక్రయిస్తున్న దందాగాళ్లూ లేకపోలేదు.

ఏక్ రూప్ యా వాలా..

కరీంనగర్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని కొన్ని మిల్లులపై గుత్తాధిపత్యం చేస్తున్న ఓ వ్యాపారి గత దశాబ్దాల కాలంగా ఇదే దందాలో తలమునకలై పోయారని ప్రచారం. ఒక రూపాయికి కిలో రేషన్ బియ్యం దొరుకుతున్నందున ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న ఓ వ్యాపారిని ఏక్ రూప్ యా వాలా అన్న పేరే వచ్చిందంటే ఆయన దందా ఎలా కొనసాగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

సంచుల్లో సన్న బియ్యం..

ఇక పోతే కొన్ని మిల్లుల ఆవరణలో నిలువ ఉంచే విధానం కూడా అక్రమ దందాగాళ్ల మితిమీరిన తెలివి తేటలను స్పష్టం చేస్తున్నాయి. మిల్లు ఆవరణలో సన్న బియ్యం, వడ్లు నిలువ ఉంచిన సంచులను స్టాక్ చేసి పెడ్తారు. రాత్రి వేళల్లో వారు రేషన్ షాపుల నుంచి సేకరించిన బియ్యాన్ని నేరుగా రైస్ మిల్ మిషనరీలో స్టోర్ చేయిస్తున్నారు. ఒక వేళ అధికారులు ఆకస్మిక దాడులు చేస్తే మిల్లు ఆవరణలో ఉన్న సన్న బియ్యం సంచులను చూసి వెనుదిరిగిపోతారన్న ధీమాతో ఈ ఎత్తుగడతో తమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.

లోగుట్టు పెరుమాళ్లకెరుక..

అయితే, సివిల్ సప్లై అధికారులు మిల్లులను తనిఖీలు చేసినప్పుడు అక్కడ అనుమతి లేకుండా ఉన్న బియ్యం ఉన్నాయా.? లేవా అన్న విషయంపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు తప్ప అసలు విషయంపై నజర్ వేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ద్వారా ధాన్యాన్ని మిల్లర్లకు చేరవేస్తోంది. ఇందులో తరుగు పోను క్వింటాళుకు 68 కిలోల వరకు బియ్యాన్ని మిల్లర్లు ప్రభుత్వానికి అందజేయాలన్న ఒప్పందం ఉంది. ఈ అగ్రిమెంట్ మేరకే మిల్లర్లు ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్నారా.? లేదా అన్నదే మిస్టరీగా మారింది.

ఈ విషయాన్ని తేటతెల్లం చేసేందుకు టెక్నికల్ విషయాలను విస్మరిస్తుండటం అక్రమ దందాలు చేస్తున్న మిల్లర్లకు వరంగా మారిందని చెప్పాలి. ప్రధానంగా విద్యుత్ వినియోగం గురించి ఆరా తీస్తే అసలు విషయం తేటతెల్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్వింటాళు ధాన్యం మిల్లింగ్ చేయడానికి ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఖర్చు అవుతోంది, మిల్లుల్లో ఎన్ని యూనిట్ల కరెంటు కాలుతోంది అన్న విషయాలను సేకరిస్తే మిల్లుల్లో జరుగుతున్న బాగోతం అంతా బయటపడుతుందన్నది వాస్తవం.

ఆయా మిల్లులకు సీఎంఆర్ ద్వారా కేటాయించిన ధాన్యం ఎంత, ఒక గంటలో ఎన్ని క్వింటాళ్ల ధాన్యం పడుతుంది, ఆ గంటలకు కరెంటు ఎంత అవసరం ఉంటుంది అన్న వివరాలను ట్రాన్స్ కో ద్వారా సేకరిస్తే అంతకు ఎక్కువ యూనిట్లు కరెంటు వినియోగం అయిందంటే సదరు మిల్లులో అక్రమాలు జరిగినట్టేనన్న విషయం రుజువు అవుతుంది.

అలాగే మిల్లర్లు వినియోగించే కెమికల్ కూడా ఎన్ని క్వింటాళ్లకు ఎంత వినియోగించాల్సి ఉంటుంది అన్న ఎస్టిమేట్లు కూడా ఉంటాయి. ఆయా మిల్లులు కొనుగోలు చేసిన కెమికల్ ఎంత..? వినియోగించింది ఎంత.? అన్న వివరాలను కూడా పోల్చితే మిల్లుల్లో జరుగుతున్న అసలు కథ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నింటిని సరి చూసుకున్న తరువాత సీఎంఆర్ కన్నా ఎక్కువ ధాన్యం మిల్లింగ్ చేసిన మిల్లులకు అదనంగా ధాన్యం ఎలా వచ్చాయో లెక్కలు చూపాల్సిన ఆవశ్యకత రైస్ మిల్ యజమానులపై ఉంటుంది. ఇలాంటి సాంకేతికమైన విషయాలపై సివిల్ సప్లై అధికారులు దృష్టి సారిస్తే గుట్టు రట్టవుతుందని అంటున్నారు నిపుణులు.

పోలీసుల దాడులే ఎక్కువ..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంలో సివిల్ సప్లై అధికారుల కన్నా పోలీసులు చేస్తున్న దాడులే ఎక్కువ అని చెప్పాలి. కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతో పాటు సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో ఇప్పటి వరకు పట్టుకున్న రేషన్ బియ్యం కేసుల్లో పోలీసు యంత్రాంగం నమోదు చేసిన కేసులే ఎక్కువగా ఉండటం గమనార్హం.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed