డెయిరీ కోర్సు మీద ఆసక్తిగా ఉన్నారా..!

by  |
డెయిరీ కోర్సు మీద ఆసక్తిగా ఉన్నారా..!
X

దిశ, వెబ్‌డెస్క్ :తెలంగాణలో రాష్ట్రంలో అగ్రికల్చరల్‌కు సంబంధించిన చాలా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయ అనుబంధ కోర్సుల్లో ‘డెయిరీ టెక్నాలజీ’కి మంచి డిమాండ్ ఉంది. దీనిని పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం ఆఫర్ చేస్తోంది.

కోర్సు : డెయిరీ టెక్నాలజీ
కాలవ్యవధి : నాలుగు సంవత్సరాలు

అర్హత : ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ ఎంసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఈ కోర్సులో చేరవచ్చు. తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో మాత్రమే ఈ కళాశాల నెలకొల్పబడింది.

సీట్లు : ఇక్కడ ఏటా 35మంది విద్యార్థులను చేర్చుకుంటారు. ఇందులో 25 సీట్లను నేరుగా భర్తీ చేస్తారు. ఫార్మర్స్ కోటా కింద 5, ఐసీఏఆర్ నిర్వహించే రాత పరీక్ష ద్వారా ఎంపికైనా వారికి మరో ఐదు కలిపి మొత్తం 35 సీట్లు ఈ కళాశాలలో అందుబాటులో ఉన్నాయి.

కోర్సు వివరాలు :

ఈ కోర్సులో చేరిన వారు మూడేండ్ల పాటు డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ మైక్రోబయాలజీ, డెయిరీ ఇంజినీరింగ్, డెయిరీ బిజినెస్ మేనేజ్ మెంట్ తదితర కోర్సులను చదవాల్సి ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తుల తయారీ, సంరక్షించుకోవడం, సంబంధిత బిజినెస్ వంటి విషయాలను నేర్చుకుంటారు.

ఇప్లాంట్ ట్రైనింగ్ :

నాలుగో ఏడాది మొదటి సెమిస్టర్‌లో 105 రోజులు ఇప్లాంట్ ట్రైనింగ్ పేరుతో హెరిటేజ్, దొడ్ల, విజయ డెయిరీ లాంటి కంపెనీలలో ప్రాక్టికల్ శిక్షణ ఇప్పిస్తారు. సెకండ్ సెమిస్టర్‌లో హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అండ్ ఎక్సిఫీరియెన్స్ లెర్నింగ్ (హెబీఈఎల్) కోర్సు ఉంటుంది. అంటే పాల ద్వారా తయారు చేసే ఉత్పత్తులకు సంబందించిన పూర్తి శిక్షణ విద్యార్థులకు ఉంటుంది. పాల ఉత్పత్తులను తయారుచేయడం, వాటికి మార్కెటింగ్, పాల నుంచి స్వీట్స్, లస్సీ తదితర విషయాలను నేర్చుకుంటారు. అలాగే తయారు చేసిన పాల ఉత్పత్తులను వారే విక్రయిస్తారు.

బీటెక్ డెయిరీ టెక్నాలజీ పూర్తి చేసిన విద్యార్థులు ఎంటెక్ డెయిరీ టెక్నాలజీ లేదా ఫుడ్ టెక్నాలజీ కోర్సులను చేయవచ్చు. అయితే, అవి మన రాష్ట్రంలో లేవు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అభ్యసించవచ్చు. ఆసక్తి కల విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.


Next Story

Most Viewed