పీవీ సింధును కలిసి అభినందించిన మంత్రి పువ్వాడ..

by  |
పీవీ సింధును కలిసి అభినందించిన మంత్రి పువ్వాడ..
X

దిశ, ఖమ్మం టౌన్: టోక్యో ఒలంపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి హైదరాబాద్‌కు చేరుకున్న సింధు నివాసానికి వెళ్లిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సింధును శాలువతో సత్కరించి, తిరుమల వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని బహుకరించి అభినందలను తెలిపారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌కు సిద్ధం అయిన తీరు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం తన మెడల్స్ రూమ్ కి తీసుకెళ్లి పతకాలను వివరించారు. ఒలింపిక్స్ లో వచ్చిన పతకం, అర్జున్ అవార్డు, తదితర పతకాలను చూపించి వివరించారు. ఖమ్మం క్రీడాకారుల కోరిక మేరకు ఖమ్మంలో చేపట్టే సన్మాన వేడుకకు రావాలని మంత్రి పువ్వాడ కోరారు. అందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసి వచ్చేందుకు అంగీకరించారు.

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వరుసగా రెండు ఒలంపిక్స్ లలో మెడల్స్ సాధించిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ గా రికార్డ్ క్రియేట్ చేసిందన్నారు. వరుసగా ఒలంపిక్స్ లలో మెడల్స్ సాధించడం గర్వించదగ్గ విషయమని, ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు. భారత బ్యాడ్మింటన్ కి సింధు ఐకాన్ గా మారిపోయిందని, వచ్చే ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. సింధుకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడు అండగా ఉంటూ, ప్రోత్సాహం అందిస్తుందని, తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడలకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.



Next Story