క్రికెట్‌లో మంచి ఆటగాడు.. ముందుకెళదామంటే అడ్డొస్తున్న ‘పేదరికం’

by  |
క్రికెట్‌లో మంచి ఆటగాడు.. ముందుకెళదామంటే అడ్డొస్తున్న ‘పేదరికం’
X

దిశ, అనంతగిరి : ఆ యువకుడి ఆటకు పేదరికం అడ్డుగా నిలుస్తోంది. ఆర్థిక సహాయం అందించండి.. నా శక్తివంచన లేకుండా రాష్ట్రానికి మంచి పేరు తీసుకొని వస్తానంటూ ఓ యువకుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని చనుపల్లి గ్రామానికి చెందిన ధార పూర్ణాబాబు క్రికెట్‌లో అత్యంత మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 2వ, 3వ, 4వ, తేదీల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ -19 క్రికెట్ పోటీలలో ఉమ్మడి జిల్లా జట్టుకు మొదటి బహుమతి సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

వ్యక్తిగతంగా అత్యంత ప్రతిభ కనబరిచి పూర్ణాబాబు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు ఈ నెల 31న గుజరాత్‌లో జరిగే జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయడంతో పూర్ణాబాబును పలువురు ప్రముఖులు అభినందించారు. అభినందించిన వారిలో ఖమ్మం జిల్లా క్రికెట్ సెక్రెటరీ యనమల అజయ్, ప్రెసిడెంట్ బొబ్బిలి నాగ శివాజీ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, పొలంపల్లి సుధాకర్ గౌడ్ ఉన్నారు.

అడ్డుగా నిలుస్తున్న పేదరికం..

ఆటలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అతనికి పేదరికం అడ్డుగా నిలుస్తుంది.గుజరాత్‌లో రాష్ట్ర స్థాయిలో ఎంపిక అయినప్పటికీ, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నాడు.

Next Story