ఉపేక్షించేదిలేదన్న జేసీ.. ఈ పాపం ఊరికే పోదంటున్న రైతులు

by  |
Dhandha-1
X

దిశ, పరకాల: రైతులు ఆరుగాలం పండించిన పంట దళారుల ప్రమేయంతో దోపిడీకి గురవుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ పేరుతో రోజుల తరబడి ధాన్యం రాశుల వద్ద కాపలా ఉండాల్సి వస్తుంది. 20 రోజులకు పైగా ధాన్యం ఆరబెట్టినా తేమ 25% పైనే ఉందంటూ తాలు తదితరాల పేరుతో కల్లాల్లోనే మగ్గాల్సి వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచి ఉండలేక రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఐకేపీ సెంటర్లు, మిల్లర్ల మధ్య ఫిఫ్టీ ఫిఫ్టీ డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో కల్లాల్లో కాంటాలు నిర్వహించకుండానే ధాన్యం మిల్లులకు తరలిస్తూ అక్కడి వే బ్రిడ్జిపై తూకం వేసి తీసుకువెళ్లిన బస్తాలకు తరుగు నిర్ణయించబడుతుంది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు హమాలీ ఖర్చులు, మిల్లర్ తీసిన తరుగులో సగం కలిసి వస్తుంది. అంతే ఇందుకు అంగీకరించిన రైతు మాత్రమే కొనుగోలు కేంద్రంలో దాన్ని విక్రయించాల్సి ఉంటుంది. లేనట్లయితే తేమ, తాలు పేరుతో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. చేసేదేమీ లేకపోవడంతో రైతుకు ఇష్టం ఉన్నా లేకున్నా పరిస్థితులకు తలొగ్గి మిల్లర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ధాన్యం విక్రయించాల్సిన దుస్థితి నెలకొందని పలు గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి నడికూడ మండలంలోని సాయి సూర్య రైస్ మిల్ తో పాటు, దామెర, శాయంపేట, పరకాలకు చెందిన పలు రైస్ మిల్లర్లు కొంతమంది ఏజెంట్లను నియమించుకుని ఐకేపీ సెంటర్ల నిర్వాహకులతో కలిసి భారీ దోపిడీకి పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులు ఇంత బహిరంగంగా దోపిడీకి గురవుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. పత్రికల్లో కథనాలు వెలువడినా కదలని యంత్రాంగం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తమను దోపిడీ చేస్తున్నా ఏం చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని.. ఈ పాపం ఊరికే పోదంటూ పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాయింట్ కలెక్టర్ వివరణ

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్ల బహిరంగ దోపిడీపై జాయింట్ కలెక్టర్ సంధ్యారాణిని వివరణ కోరగా.. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు నిర్వహించకుండా మిల్లర్లు డైరెక్ట్ కొనుగోలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తరుగు, తాలు పేరుతో ఎలాంటి కోత విధించినా ఉపేక్షించేదిలేదంటూ అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామంటూ జేసీ తెలిపారు.


Next Story

Most Viewed