మీ సంపద కంటే ప్రజల గోప్యతే విలువైంది.. వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

by  |

న్యూఢిల్లీ: మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీ కంపెనీ విలువ మూడు లక్షల కోట్ల డాలర్లు కావొచ్చు. కానీ, ప్రజలకు వారి గోప్యతే ప్రధానం. మీ సంపదతో సంబంధం లేదు. వారి గోప్యతను కాపాడటం దేశ అత్యున్నత న్యాయస్థానంగా మా బాధ్యత’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ నూతన గోప్యత విధానంపై ఆ సంస్థకు, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని ఆదేశించింది.

వాట్సాప్ జనవరిలో గోప్యత విధానాన్ని అప్‌డేట్ చేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పాలసీని అందరికీ తప్పనిసరి చేసింది. దీని నుంచి తప్పుకునే అవకాశాన్ని యూజర్లకు ఇవ్వలేదు. అయితే, యూరప్ దేశాల్లో ఈ విధానాన్ని భిన్నంగా అమలు చేస్తున్నదని, అక్కడ గోప్యతను కాపాడుకునేలా పౌరులకు స్వేచ్ఛనిచ్చిందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ విధానంతో వ్యక్తిగత సమాచారం ఫేస్‌బుక్, థర్డ్ పార్టీ సంస్థలతో పంచుకునే అవకాశం వాట్సాప్‌కు దక్కుతుందని ఆరోపణలున్నాయి.

ఈ పిటిషన్‌ను విచారిస్తూ ‘మీది మూడు లక్షల కోట్ల డాలర్ల విలువైన కంపెనీ కావొచ్చు. కానీ, ప్రజలు వారి గోప్యతకే విలువనిస్తారు. ప్రజల గోప్యతను కాపాడే బాధ్యత మాపై ఉన్నది’ అని పేర్కొంటూ వాట్సాప్, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. వ్యక్తిగత గోప్యతను కోల్పోతామనే భయాందోళనలు ప్రజల్లో నెలకొన్నాయని, తాము ఎవరికైనా సందేశాలు పంపిస్తే మొత్తం సారాంశమంతా ఫేస్‌బుక్‌కు చేరిపోతుందనే అనుమానాలు వ్యక్తపరుస్తున్నారని సీజేఐ ఎస్‌ఏ బాబ్డే వ్యాఖ్యానించారు. యూరప్ మినహా అన్ని దేశాల్లోనూ ఇదే తరహా నిబంధనలను అమలు చేస్తున్నామని వాట్సాప్ తరఫున వాదిస్తూ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అన్నారు. యూరప్‌లో గోప్యతపై చట్టాలున్నందున అక్కడ పాలసీని మార్చాల్సి వచ్చిందని, భారత్‌లోనూ అలాంటి చట్టముంటే అందుకు లోబడే పాలసీని రూపొందించేవారమని చెప్పారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా ఈ వాదనలపై అభ్యంతరం తెలిపారు. ‘ఇక్కడ చట్టమున్నదా లేదా అనేది ముఖ్యం కాదు. ప్రజల గోప్యతను కాపాడాల్సిందే. అది వారి ప్రాథమిక హక్కు’ అని వాదించారు. ఈ కేసు విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed