బడులు బందాయే.. బతుకులు ఆగమాయే!

by  |
బడులు బందాయే.. బతుకులు ఆగమాయే!
X

దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితమవుతుందంటారు. ఆ తరగతి గదులకే కేంద్ర బిందుల్లాంటి టీచర్లు కొలువులు కోల్పోయి.. బతుకుపోరాటంలో అలసి తనువు చాలిస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రైవేటు టీచర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నది. గత ఏడాది అక్టోబర్​ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 30 మంది ప్రైవేటు టీచర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఉద్యోగం లేక, పూటగడవడం భారంగా మారి తనువు చాలించారు. ఇంకా కొందరు కొందరు ఉపాధ్యాయ వృత్తిని వదిలి వేరే పనులు చేసుకుంటున్నారు. పూలు అమ్మిన చోటనే కట్టెలమ్ముతున్న పరిస్థితి వాళ్లది. యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో ఒకరు కొబ్బరిబోండాల వ్యాపారం చేస్తుండగా.. మరొకరు కూరగాయలు అమ్ముతున్నారు. కిరాణాషాపుతో బతుకుబండిని లాక్కొస్తున్నది మరొకరు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు తమ వద్ద పనిచేస్తున్న టీచర్లను పట్టించుకోవడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేటు టీచర్ల బతుకులను కరోనా మహమ్మారి ఆగంచేసింది. పిల్లల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యాజమాన్యాలు టీచర్లకు మొండి చెయ్యి చూపుతున్నాయి. అక్కడక్కడా ఇచ్చినా ఎంతో కొంత అన్నట్టుగా ఉంటున్నది. దీంతో పొట్టకూటి కోసం వారు కూలీలుగా, ఇతర పనుల్లో చేరుతున్నారు. ఆత్మాభిమానంతో ఆ పనులు చేయలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. గత ఏడాది అక్టోబర్​ నుంచి గురువారం వరకు 30 మంది టీచర్లు ఉపాధి కోల్పోయి తనువు చాలించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ చిన్నపాటి ఉపశమనాన్ని కల్పించారు. రాష్ట్రంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు లాక్‌డౌన్‌ కారణంగా గత ఏడాది మార్చి 22వ తేదీ నుంచి మూతపడ్డాయి. వీటిల్లో పనిచేసే వేలాదిమంది బోధన, బోధనేతర సిబ్బందికి కొన్ని పాఠశాలలు మార్చి నెల జీతాలు ఇవ్వగా, మరికొన్ని మార్చి 21వ తేదీ వరకు జీతాలు చెల్లించాయి. ఏప్రిల్‌ నెల నుంచి వీరు పని చేయకపోవడంతో జీతాలు ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. దీంతో ఎంతో కాలంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను యాజమాన్యాలు తొలిగించాయి. ఉపాధ్యాయ వృత్తినే నమ్ముకుని బతుకీడుస్తున్న వేలాది మంది రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌ ముందు వరకు రాష్ట్రంలో ప్రైవేటు బడులు, కళాశాలల్లో పని చేసిన వారు దాదాపు ఐదు లక్షల వరకు ఉంటే.. వీరిలో 30శాతం నుంచి 35శాతం మంది ఉపాధ్యాయులు బోధనకే దూరమయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు, వారి కుటుంబాలు పూట గడవని పరిస్థితుల్లో ఉపాధి కూలీలు, కూరగాయలు, పండ్లు అమ్మే వెండర్లు, రోజువారీ కూలీలు, మార్కెటింగ్​, చిరు వ్యాపారాలతో పాటు కులవృత్తులను చేసుకుంటున్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారి ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా ఆదుకోవలసిన ప్రభుత్వం, ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూనే ఉన్నాయి.

పున:ప్రారంభమైనా అంతే..!

కరోనా సృష్టించిన కల్లోలంలో ప్రైవేటు పాఠశాల టీచర్లకు ఇటీవల కొంత ఉపశమనం కల్గించే విధంగా పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలు, లక్షల రూపాయల ఫీజులను వసూలు చేసిన యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలను చెల్లించలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం మళ్లీ విద్యా సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. దీంతో ప్రైవేట్​ పంతుళ్లు యధాతథంగా రోడ్డుపై పడ్డారు. కనీసం తిండికి కూడా లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్‌లైన్‌ విద్యను కొనసాగిస్తున్న బడులు, కళాశాలలు ఒక్కటి, రెండు జిల్లాలకు కలిపి ఒకే చోట నుంచి పాఠాలు బోధిస్తున్నాయి. అదే లింకును విద్యార్థులకు పంపిస్తున్నాయి. నెలలో 26గంటలు పనిచేస్తే… వేతనంగా మాత్రం వెయ్యి, రెండు వేలను పంపిస్తున్నారని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా సబ్జెక్టుల ప్రాధాన్యం ప్రకారం ఆ ఉపాధ్యాయుడికి సమయం కేటాయిస్తున్నారు. గణితం, భౌతికశాస్త్రం చెప్పే వారికి కాస్త ఎక్కువ గంటలు పని దొరికే అవకాశం ఉన్నా.. మిగతా సబ్జెక్టులకు ఆ వీలు కల్పించడం లేదు. ఒక ఉపాధ్యాయుడు మూడు గంటలు పని చేస్తే వేతనం రూ. 300 నుంచి రూ. 500లు మాత్రమే. గతంలో రూ.15 వేల వరకు వేతనం అందుకున్న వారికి ఇప్పుడు రూ.2 వేలు కూడా రావడం లేదు.

సచ్చిపోతున్నారు

ప్రైవేట్​ఉపాధ్యాయులు ఉసురు తీసుకుంటున్నారు. బతుకలేక బలిపీఠమెక్కుతున్నారు. గత ఏడాది అక్టోబర్​ నుంచి బుధవారం వరకు రాష్ట్రంలో 30 మంది ప్రైవేట్​ టీచర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆర్థిక కష్టాల్లో చేయూతనందించే వారు కనిపించకపోవడంతో ప్రాణాలు వదులుతున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉండగా… ఇప్పటి దాకా బతికేందుకు చేసిన అప్పులు తీరే మార్గం లేకపోవడం, విద్యా సంస్థలు వేతనాలు ఇచ్చే పరిస్థితి కనిపించక ఉసురుతీసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డు పడేస్తున్నారు. నాగార్జున సాగర్​లో మంగళవారం ఓ టీచర్​ ఆత్మహత్య చేసుకోగా.. ఆయన భార్య అక్కమ్మ కూడా గురువారం సాగర్​ కుడికాల్వలో దూకి ప్రాణాలు వదిలింది. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.

మానవత్వమే మరిచారు

ప్రైవేట్​ యాజమాన్యాలు మానవత్వం మరచి వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. కనీసం ఆదుకునే ప్రయత్నాలేమీ చేయడం లేదు. ప్రైవేట్​టీచర్ల కష్టాలు చూసి సెలూన్​ యజమానుల హృదయం ద్రవిస్తున్నది. మొన్న జనగామలో, నిన్న వనపర్తి జిల్లా అమరచింతలో ప్రైవేటు టీచర్లకు ఉచితంగా హేర్​కటింగ్​, షేవింగ్​ చేయనున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని జన్నారంలో ఇమ్రాన్​ అనే మోటారు సర్వీసింగ్​ యజమాని ఉచిత సర్వీసింగ్​ చేస్తామంటూ వెల్లడించారు. హృదయ వేదనతో ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ వేడుకున్నారు. ఇక ఎట్టకేలకు ప్రభుత్వం ప్రైవేట్ఉపాధ్యాయులకు నెలకు రూ. 2 వేలు, 25 కిలోల బియ్యాన్ని ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్​ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఈ సాయం చేయనున్నారు.

మమ్మల్ని రోడ్డున పడేశారు : షబ్బీర్​ అలీ, తెలంగాణ ప్రైవేట్​ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు

రాష్ట్రంలో కరోనా సాకుతో పాఠశాలలను మూసివేయడం చాలా దారుణం. బార్లలో లేని కరోనా పాఠశాలలకే వచ్చిందా. పక్క రాష్ట్రంలో నిబంధనల ప్రకారం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ మాత్రం లక్షల రూపాయల ఫీజులను వసూలు చేసుకొని పది రోజులు కూడా పాఠశాలు చెప్పకుండా మూసేశారు. విద్యా సంస్థల కమీషన్లకు ప్రభుత్వం లొంగిపోయింది. ప్రైవేట్​ఉపాధ్యాయులు ఆర్థిక బాధలను తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎలాగైనా బతుకుదాం. ఆత్మహత్యలు మాత్రం చేసుకోవద్దు.

చావకుంటే ఏం చేస్తాం : భాస్కర్​ రాథోడ్​, జీవశాస్త్ర ఉపాధ్యాయులు, రంగారెడ్డి జిల్లా

కరోనాతోనే చాలా కష్టాలు వచ్చాయి. కనీసం ఎలా ఉన్నారని అడిగేవారు కూడా లేరు. ఇప్పుడు బడులు తెరిస్తే బతుకుతాం అనుకున్నాం. కానీ మళ్లీ బంద్​ చేశారు. ఇక ఏ చేస్తాం. నల్ల బల్ల, తెల్ల సుద్దముక్కతో విద్యార్థుల జీవితాలను రంగుల మాయం చేస్తూ, సమాజానికి వెలుగులు పంచె ప్రైవేట్ టీచర్ల జీవితంలో మాత్రం అంధకారమే మిగిలింది.



Next Story

Most Viewed