ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!

by  |
ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!
X

దిశ, కరీంనగర్ సిటీ: జిల్లా కేంద్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు అటకెక్కించి, తమ ఆదేశాలను మాత్రమే ఆచరణలో పెడుతున్నాయి. ఓవైపు కరోనా భయం ఇంకా పూర్తిగా తొలగిపోనేలేదు. రెగ్యులర్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయనేలేదు. అప్పుడే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్ చేశాయి. గత కొద్ది మాసాలుగా జరుగుతున్న ఆన్‌లైన్ క్లాసులకు ఫుల్‌స్టాప్ పెట్టి, రెగ్యులర్ తరగతులు ప్రారంభించాయి. తమ పిల్లలందరినీ పాఠశాలలకు పంపించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్‌లు కూడా పంపిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ వైరస్ శీతాకాలంలో చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్న నేపథ్యంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై కొద్ది నెలలుగా ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఎట్టకేలకు ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు రెగ్యులర్ పాఠాలు బోధించేలా ఆదేశాలు జారీ చేసింది. దీన్ని ఆసరాగా చేసుకున్న పలు ప్రైవేట్ పాఠశాలలు సోమవారం నుంచే విద్యార్థులకు పాఠాలు బోధించటం మొదలు పెట్టాయి.

గత నెల నుంచే క్లాసులు

యూనియన్ నాయకులమని చెప్పుకునే నగరంలోని ఒకరిద్దరికి చెందిన పాఠశాలలు గత నెల చివరి వారం నుంచే నడుస్తుస్తున్నా, విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. ప్రభుత్వ సూచనలననుసరించి ఈ నెల 25 లోపు తరగతి గదులు పూర్తిగా శానిటేషన్ చేసిన అనంతరం, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే సీటింగ్ ఏర్పాట్లు చేసి తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, నగరంలోని కొంతమంది ప్రైవేట్ విద్యా సంస్థల నిర్వాహకులు కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కి, ఒక్కో గదిలో 50 నుంచి 60 మంది విద్యార్థులను పక్క పక్కనే కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది నెలల్లో విద్యాసంవత్సరం ముగియనుండగా, సిలబస్ పూర్తి చేసేందుకు 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు కూడా పాఠాలు బోధిస్తున్నట్లు, కేవలం ఫీజుల వసూల్లే లక్ష్యంగా పాఠశాలలు తెరిచినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నిర్వాకంపై, జిల్లా విద్యా శాఖ అధికారిని వివరణ కోరగా.. ఫిర్యాదు చేస్తే అధికారులను విచారణకు పంపుతామంటూ చెప్పడం కొసమెరుపు.

విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం : కసిరెడ్డి మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు

ఓ వైపు కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం, వైద్య శాఖ చెప్తున్నా నగరంలో ప్రైమరీ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించడం అంటే వారి ఆరోగ్యంతో చెలగాటం ఆడటమే. ఇది ప్రభుత్వ, విద్యాశాఖ నిబంధనలకు వ్యతిరేకమని వెంటనే నిబంధనలకు విరుద్ధంగా ప్రైమర్ విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి.


Next Story

Most Viewed