కరోనా పోరులో మేము సైతం

by  |
కరోనా పోరులో మేము సైతం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాపై పోరులో భాగస్వాములమవుతామంటూ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్లు చొరవతో ముందుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలకు కరోనాపై అవగాహన లేనందున తమ వంతు కృషిగా వారికి సకాలంలో టెస్టింగ్, చికిత్స అందించేందుకు తోడ్పడతామని మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ప్రాథమిక దశలోనే కరోనా ఉందో లేదో నిర్ధారణకు సహకరించి వారికి సకాలంలో వైద్యం అందేలాగ ప్రాథమిక ఆసుపత్రులకు పంపించేలా చొరవ తీసుకోవాలని సూచించారు. వైరస్‌ను తొలి దశలోనే గుర్తించడం ద్వారా చాలా తక్కువ ధర కలిగిన సాధారణ మందులతో వారికి నయం చేయవచ్చునని, ఆసుపత్రుల్లో చేరే పరిస్థితి రాకుండా నివారించవచ్చునని వారికి సూచించారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చూడొచ్చునన్నారు.

ఇంతకాలం ప్రజల మీద ఆధారపడి ఈ వృత్తిలో కొనసాగుతూ బతుకుతున్నామని, కరోనా కష్టకాలంలో తమ వంతు కృషిగా ప్రభుత్వానికి, ప్రజలకు ఉపయోగపడాలనుకుంటున్నామని మంత్రికి వారు వివరించారు. కరోనాపై పోరులో తమ సేవలను కూడా వినియోగించుకోవాలని కోరారు. గతంలో న్యూమోనియా, లెప్రసీ, టీకాలు, కుటుంబ నియంత్రణ లాంటి అనేక రకాల అవసరాల్లో ఉపయోగపడ్డామని, ఇప్పుడు కూడా సహకారం అందించాలనుకుంటున్నామని తెలిపారు. మంత్రిని కలిసి గ్రామాల్లో ప్రజల ఆలోచన, అనారోగ్యం పట్ల కనీసమైన అవగాహన లేకపోవడం, సీజన్ మారినప్పుడల్లా వచ్చే అనారోగ్య సమస్యలు ఇప్పుడు కరోనా పరిస్థితుల్లో వారిని గందరగోళానికి గురిచేస్తాయని ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్ల సంఘం అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, కార్యదర్శి శివరాజ్, తెలంగాణ కమ్యూనిటీ పారమెడిక్ వైద్యుల ఐక్య వేదిక ప్రెసిడెంట్ అశోక్, సెక్రెటరీ నవీన్ తదితరులతో పాటు వివిధ ఆర్ఎంపీ, పీఎంపీ సంఘాల ప్రతినిధులు పాల్గొని వివరించారు.



Next Story

Most Viewed