క్రీడాకారుల ప్రదర్శన ప్రతి పౌరుడిని గర్వపడేలా చేసింది: ప్రధాని

by  |
క్రీడాకారుల ప్రదర్శన ప్రతి పౌరుడిని గర్వపడేలా చేసింది: ప్రధాని
X

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 79వ ఎడిషన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు ఆందోళనలు, టోక్యోలో ఒలింపిక్ క్రీడలు కొనసాగుతున్న వేళ పౌరులకు ప్రధాని పలు సూచనలు చేశారు. టోక్యోలో భారత్ విజయానందాన్ని ప్రస్తావిస్తూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టోక్యోలో భారత క్రీడాకారుల ప్రదర్శన ప్రతి పౌరుడిని గర్వపడేలా చేస్తున్నదన్నారు. పౌరులందరూ వారికి ప్రోత్సహామివ్వాలని సూచించారు. ఇందుకోసం విక్టరీ పంచ్ క్యాంపెయిన్ ఇప్పటికే ప్రారంభమైందని, ఈ క్యాంపెయిన్‌లో పాలుపంచుకుని భారత అథ్లెట్‌లను ఎంకరేజ్ చేయాలని చెప్పారు. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం ప్రత్యేకమైనదని, ఇది 75వ స్వాతంత్ర్య ఉత్సవాలని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించి వాటి రికార్డింగ్‌లను పంపాలన్నారు. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్రగాన్ డాట్ ఇన్ వెబ్‌సైట్‌ను సృష్టించినట్ట వివరించారు.

కార్గిల్ విజయ్ దివాస్..

జులై 25న కార్గిల్ విజయ్ దివాస్‌గా పాటిస్తామని తెలిసిందే. ఈ సందర్భంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో కార్గిల్ యుద్ధాన్ని ప్రధాని ప్రస్తావించారు. ‘రేపు కార్గిల్ విజయ్ దివాస్. భారత జవాన్‌ల ధైర్యాన్ని, ధీరత్వాన్ని కార్గిల్ యుద్ధం ప్రపంచానికి తెలియజేసింది. అంతటి గొప్ప ఘటన గురించి మీరంతా చదివి తెలుసుకోవాలనుకుంటున్నాను. కార్గిల్ యోధులకు అందరం సెల్యూట్ చేద్దాం’ అని కీర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక శాఖ ఒక కొత్త కార్యక్రమాన్ని చేపడుతున్నదన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు చూపించిన దారిలో ప్రయాణించేలా చేయడమే అమృత్ మహోత్సవ్ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.

ఖాదీ.. స్వదేశీ ఉద్యమం

ఆగస్టు 7న నిర్వహించే జాతీయ హాండ్లూమ్ దినోత్సవం గురించి ఈ కార్యక్రమంలో ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఖాదీ ఉత్పత్తుల గురించి మాట్లాడుతూ 1905లో మొదలైన స్వదేశీ ఉద్యమం నేపథ్యాన్ని ప్రస్తావించారు. బాపూజీ సారథ్యంలో ‘భారత్ వదిలివెళ్లండి’ అనే ఉద్యమం తరహా ప్రతి పౌరుడు ‘భారత్‌ను ఐక్యం చేయండి’కి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. దేశంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు హాండ్లూమ్ ప్రధాన ఆదాయ వనరు అని, ప్రతి పౌరుడు ఖాదీ ఉత్పత్తులను ప్రచారం చేయాలని, కొనుగోలు చేయాలని కోరారు. స్థానిక ఉత్పత్తి కోసం ఉద్యమించి దేశనిర్మాణంలో బలమైన పాత్రపోషించవచ్చన్నారు. నేడు సాగుపైనా విజయవంతమైన ప్రయోగాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం మణిపూర్‌లోని ఉక్రుల్‌లోనూ యాపిల్ సాగు చేస్తున్నారని వివరించారు. శిక్షణ కోసం రైతులు హిమాచల్ ప్రదేశ్‌కూ వెళ్తున్నారని పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమానికి సందేశాలు పంపుతున్నవారిలో 75శాతం మంది 35ఏళ్లలోపు వారేనని, తద్వారా ఈ కార్యక్రమాన్ని యువత కేంద్రంగా నడుస్తున్నదని వివరించారు.

తిరుప‌తి యువ‌కుడు ప్రణీత్‌పై ప్రధాని ప్రశంసలు

చిత్తూరు జిల్లా తిరుప‌తికి చెందిన సాయి ప్రణీత్ అనే యువ‌కుడిపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియాలో రైతుల‌కు ఏపీ వెదర్‌మ‌న్ పేరుతో వాతావ‌ర‌ణ స‌మాచారం అందిస్తున్న సాయిప్రణీత్‌ సేవలను ప్రధాని మోడీ కొనియాడారు. బెంగ‌ళూరులో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్‌గా ప‌నిచేస్తున్న సాయి ప్రణీత్ రైతుల‌కు అందిస్తున్న సేవ‌ల‌కుగాను ఐక్యరాజ్య సమితి, భార‌త వాతావ‌ర‌ణ శాఖ నుంచి కూడా గ‌తంలో ప్రశంసలు అందుకున్నారు. సాయి ప్రణీత్ వాతావరణ వివరాలను ప్రతిరోజు తన సోషల్ మీడియా ద్వారా అప్డేట్ ఇస్తుంటారు.

Next Story