భారీ వర్షం.. వంతెన లేక నిండు గర్భిణీ నరకయాతన..!

by  |
భారీ వర్షం.. వంతెన లేక నిండు గర్భిణీ నరకయాతన..!
X

దిశ, తాండూర్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వంతెనలు లేక సమయానికి వైద్యం అందక నిన్న ఓ బాలిక మృతి చెందిన ఘటన మరువక ముందే మరో వంతెనపై వరద నీరు పొంగిపొర్లడంతో నిండు గర్భిణీని రైల్వే పట్టాలపైన ఉండే బండి ద్వారా ఆ మహిళను తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరణ్ కోట్ గ్రామంలో నివసించే బీహార్‌కు చెందిన వలస కూలీ నిండు గర్భిణీ. నెలలు నిండటంతో అంబులెన్సు ద్వారా తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా.. మధ్యలో బెల్కటూర్ వాగు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఉప్పొంగి ప్రవహించింది. దీంతో వాహనం వెళ్లడానికి దారి లేకపోవడంతో రైల్వే గ్యాంగ్ మెన్ ఉపయోగించే చక్రాల బండి పై వాగు దాటించారు.

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని ఆందోళనలు చేసినా, రాష్ట్ర మంత్రికి ఎన్నిమార్లు వినతి పత్రం సమర్పించినా ఇప్పటివరకు వాగుపై వంతెన నిర్మాణం జరగలేదు. నాయకులు, అధికారుల అలసత్వంతో ఇంకెన్ని ప్రాణాలు పోతాయోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా వంతెన నిర్మాణం జరిపించాలని తాండూరు ప్రజలు కోరుతున్నారు.



Next Story