ప్రమాదాలు జరిగినా.. పట్టించుకోరా!

by  |
ప్రమాదాలు జరిగినా.. పట్టించుకోరా!
X

దిశ, ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్​ సమస్యలు పొంచి ఉన్నాయని, ఇంటిపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ ​తీగల వల్ల చనిపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్​లు తీర్మానం చేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యాం నాయక్ స్పందించి ఖానాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించినా ఫలితం లేదని ఆరోపణలున్నాయి.

సుర్జాపూర్ గ్రామ పరిధి అంబేద్కర్ కాలనీలో ఇండ్లపై నుంచి కరెంట్ ​వైర్లు వెళ్తున్నాయని, తొలగించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తునారు. మేడంపెళ్లి పరిధిలో సదర్మాట్ ప్రాజెక్టుకు వెళ్లే దారిలో 33/11 కేవీ లైన్​కిందికి వేలాడుతోందని, దీంతో ఆ దారిన వెళ్లే వారితోపాటు మేత కోసం వెళ్లే పశువులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలా చాలా గ్రామాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయని, మరమ్మతు చేయాలని అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. పది రోజుల క్రితం సత్తనపల్లి గ్రామంలో ఇంటికి సున్నం వేస్తుండగా అదే ఇంటి పైనుంచి వెళ్లే 33/11 కేవీ హై టెన్షన్ కరెంటు తీగల వల్ల అర్జన, పత్రి అరుణ్ తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్జున మృతి చెందడంతో మండల ప్రజలు భయాందోళన చెందుతున్నారు

లూజ్​వైర్లను సరిచేయలి

గ్రామంలో లూజు వైర్లను సరిచేస్తామని చెబుతున్న అధికారులు ఆ తరువాత పట్టించుకోవడం లేదు. సుర్జాపూర్ శివారు మేడంపల్లిలో కొత్తగా 33/11 సబ్​స్టేషన్​ఏర్పాటు చేశారు. గతంలో 50 ఏళ్లుగా ఉన్న కరెంట్​లైన్​ను తొలగించాని విన్నవించుకున్నా ఫలితం లేదు.

–అనుప హరీశ్ (సుర్జాపూర్ ఉప సర్పంచ్)

మూడు మీటర్ల ఎత్తులోనే వైర్లు

సదర్మాట్ ప్రాజెక్టు కు వెళ్లే దారి పక్కనే ఉన్న 33/11కేవీ లైను మూడు మీటర్లు ఎత్తులోనే ఉంది. అటువైపు మనుషులు, పశువులు వెళ్లే ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. లైను మరమ్మతులు చేయాలని మొత్తుకుంటున్నా విద్యుత్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.

–అంగోత్ అంబాజీ మేడం పెళ్లి గ్రామస్తుడు

సమస్యల పరిష్కారానికి చర్యలు

మండల పరిధిలోని గ్రామాల్లో తలెత్తిన విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా విద్యుత్​లూజు వైర్లు, వంగిన, విరిగి పోయిన స్తంభాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాము. నెల రోజుల్లో విద్యుత్ సమస్యలను పూర్తిగా పరిష్కారం చేస్తాము.

–లచ్చన్న (ఏఈ ఖానాపూర్​)


Next Story

Most Viewed