‘పింఛన్ పైసలు నొక్కేస్తున్న పోస్టాఫీస్ అధికారులు’

by  |
postoffice 1
X

దిశ, గండిపేట్ :‍ మ‌ణికొండ పోస్టాఫీసులో అధికారులు అక్రమాల‌కు పాల్పడుతున్నారు. పింఛ‌న్లపై ఆధార‌ప‌డే వికలాంగులు, వృద్ధులు, వితంతువులను సైతం వీరు విడిచిపెట్టడం లేదు. ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న పింఛ‌న్లను ఆస‌రాగా చేసుకొని ఎంతో మంది జీవ‌నం సాగిస్తుంటారు. ఈ త‌రుణంలో మ‌ణికొండ సిబ్బంది విక‌లాంగులు, వృద్ధులు, వితంతువుల‌ను టార్గెట్‌గా చేసుకొని వారి పింఛ‌న్లు కాజేస్తున్నారు. రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి వ‌స్తున్న పింఛ‌న్లను ఇవ్వడంలో అధికారులు జాప్యం వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా బాధితుడు హరికృష్ణ మాట్లాడుతూ.. రెండేళ్లుగా పెన్షన్ ఇవ్వకుండా వేధిస్తున్నార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. వికలాంగులకు సర్కారు నుండి రూ.3,016/- వృద్దులు, వితంతువులకు రూ.2,016/- ఇస్తుండగా చిల్లర లేదంటూ ప్రతీ పింఛన్ దారు నుండి రూ.16/-లు కొట్టేస్తున్నారు.

ఈ మణికొండ పోస్టాఫీసులో నెలనెలా 400 మంది పింఛ‌న్లను తీసుకుంటున్నారు. ప్రతి నెలా పింఛన్ దారుల నుండి 400 మందికి ఇవ్వాల్సిన రూ.16 చొప్పున‌ 6,400 వ‌సూలు చేస్తున్నార‌న్నారు. దీంతో రెండేళ్లుగా 6,400 చొప్పున రూ.1,53,600 సొమ్ము కొట్టేశారని అన్నారు. ఈ విషయంపై వివరణ ఇమ్మని పోస్టాఫీస్ ఇంచార్జీని వివ‌ర‌ణ అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. పేరేంటని అడిగితే చెప్పనని ఎదురు బ‌దులిచ్చారు. పైన వచ్చే రూ.16లు ఇవ్వమని అడిగితే, సర్వర్ డౌన్ ఉందని, తరువాత రావాలని ఇబ్బందులుకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పోస్టాఫీసు సిబ్బంది ఇలా పింఛ‌న్‌దారుల‌ను నిలువునా దోచుకుంటుండ‌టంతో వారు ఆందోళ‌న చెందుతున్నారు. పింఛ‌న్‌దారులను దోచుకుంటున్న పోస్టాఫీస్ అధికారులపై చ‌ర్యలు తీసుకొని త‌మ‌కు న్యాయం చేయాల‌ని బాధితులు కోరుతున్నారు.

Next Story

Most Viewed