అసైన్డ్ దందా.. పేదల భూముల్లో అక్రమార్కులు

by  |
అసైన్డ్ దందా.. పేదల భూముల్లో అక్రమార్కులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరాలు విస్తరించాయి. సాగు భూములు లేఅవుట్లుగా మారాయి. బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. ఆఖరికి పేదలు దున్నుకొని బతకడానికి ఇచ్చిన భూములలోనూ నిర్మాణాలు వెలిశాయి. రియల్టర్ల మాయాజాలం, పంచాయతీల మద్దతుతోనే ఈ పరిస్థతి ఏర్పడింది. రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, యాదాద్రి, నల్లగొండ జిల్లాలలోని పలు మండలాల అసైన్డ్‌ భూములు ఆనవాళ్లు కోల్పోయాయి. దశాబ్దాల క్రితం పేదలకు భూములను ఇచ్చినప్పటికీ ఇప్పుడవి వారి చేతులలో లేవు. సాదాబైనామాలతో చేతులు మారాయి.

రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, హెచ్‌ఎండీఏ, పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా పేదల భూములు లేఅవుట్లుగా మారాయి. కొంత పట్టాభూమి, మరికొంత అసైన్డ్ భూములతో వెంచర్లు చేసిన ఉదంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వందలాది ఎకరాలతో లేఅవుట్లు చేసిన వాటిలో చెరువులు, కుంటలతో పాటు లావునీ పట్టా భూములు కూడా ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఐదేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ల్యాండ్స్‌ కమిటీ గుర్తించింది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడమో, అసైన్డ్‌దారులకు అప్పగించడమో చేసే ఆస్కారం లేకుండా పోయింది. ప్లాట్లుగా పలువురి చేతులు మారింది. ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని టాస్క్‌ఫోర్స్‌ అభిప్రాయపడింది. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఈ భూముల క్రమబద్ధీకరణ అనివార్యంగా మారిందని టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ ల్యాండ్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌కే సిన్హా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. తిరిగి స్వాధీనం చేసుకోలేకపోవడం, ఆశించిన లక్ష్యం నెరవేరనప్పుడు రెగ్యులరైజ్‌ చేయడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. రెండేళ్ల పదవీ కాలంలో ఏడు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారు. అసైన్డ్‌ భూములన్నీ లేఅవుట్లుగా మారాయి. వాటిని స్వాధీనం చేసుకోవడం అసాధ్యమన్న మాట వినిపిస్తోంది. క్రమబద్ధీకరణ అనివార్యమని టాస్క్‌ఫోర్స్‌ ఆన్‌ ల్యాండ్‌ కమిటీ తేల్చి చెప్పింది.

అసెంబ్లీలో ప్రస్తావన

అసైన్డ్ భూముల గురించి అసెంబ్లీలోనూ సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. అమ్ముకోవడానికి అవకాశం కల్పించాలని కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యేలతో కమిటీ వేస్తామని, అందరూ కూర్చొని ఓ నిర్ణయానికి వస్తే చర్చిద్దామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికైతే ఆచరణకు నోచుకోలేదు. కొందరు ఎమ్మెల్యేలు కూడా తమకు సన్నిహితంగా ఉన్న రైతులకు కేటాయించిన భూములను విక్రయించేందుకు అవకాశం కల్పించాలన్నారు. ఇప్పటికే వేలాది మంది రైతులకు కూడా పాస్ పుస్తకాల జారీని నిలిపివేశారు. గతంలో నోటరీల ద్వారా ఎకరాల కొద్దీ క్రయవిక్రయాలు జరిగాయి. ఇంటి స్థలాల లెక్కనా అమ్మేసిన ఉదంతాలు వేలల్లో ఉన్నాయి. అసైన్డ్ భూములలో కాలనీలు, బస్తీలే కాదు, విద్యాసంస్థలు కూడా నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన కొందరు వారి విద్యాసంస్థల విస్తీర్ణంలో కలిపేసుకున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించాలంటూ జీఓ 59 కింద దరఖాస్తు చేసుకున్న వారున్నారు. ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించాలంటూ దరఖాస్తు చేసుకున్న యజమానులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అసైన్డ్ భూములంటూ అధికారులు తిరస్కరించారు. రెగ్యులరైజ్ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానా నిండేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

లావునీ పట్టా.. అస్తవ్యస్తం

ఫిర్యాదులు వచ్చిన ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, కొల్లూరు, తెల్లాపూర్‌, అమీన్‌పూర్‌, హయత్‌నగర్‌ ప్రాంతాలలో టాస్క్ ఫోర్స్ ఆన్ ల్యాండ్ కమిటీ పర్యటించింది. అసైన్డ్‌దారులెవరూ సదరు భూములను అనుభవించడం లేదని లెక్క తేల్చింది. రెండు వేల ఎకరాలకు పైగానే పరాయీకరణ జరిగిందని గుర్తించింది. ఈ అక్రమాలలో రియల్టర్లతో పాటు రెవెన్యూ యంత్రాంగమంతా భాగస్వాములేని కమిటీ చైర్మన్‌ గా పని చేసిన ఎస్‌కే సిన్హా నిగ్గు తేల్చారు. మరోదఫా ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి ఫీజులను వసూలు చేసి క్రమబద్ధీకరించాలన్నారు. సుమారు రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సిఫారసులో పేర్కొన్నట్లు తెలిసింది. మిగతా మండలాలలోనూ క్రమబద్ధీకరణ ప్రక్రియలోకి తీసుకురావచ్చునని సూచించారు. న్యాయసమీక్ష ద్వారా రూ.వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఎంతో ఉంది.

ఆరేండ్లయినా తేలని లెక్క

అసైన్డ్‌ భూముల లెక్క తేల్చాలని సీఎం అధికారులను, కలెక్టర్లను ఆదేశించారు. ఆరేండ్లు కావస్తోంది. లెక్క తేలలేదు. రికార్డులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎందరి చేతులో మారినట్లుగా తెలుస్తోంది. కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు కొనుగోలు, అమ్మకాలకు ఊతమిచ్చారు. చెల్లవని తెలిసినా అవినీతి అధికారుల అండదండలతో సొంతం చేసుకున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ విస్తరణ, నగరాభివృద్ధి, పారిశ్రామీకరణలతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. సాగు చేసుకోవడానికి పంపిణీ చేసిన భూములు వృథాగా ఉంచారు. కొన్ని గ్రామాలలో అసైన్డ్‌దారుల నుంచి రియల్టర్లు కొనుగోలు చేసి లే అవుట్లుగా మార్చారు. అమ్మకాలు కూడా పూర్తి చేశారు. కొనుగోలు చేసిన కాలం నాటి మార్కెట్లకు అనుగుణంగా ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరించడం అనివార్యమని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు.


Next Story

Most Viewed