సెల్‌ఫోన్‌లను చూసి జంకుతున్న రాజకీయ నేతలు.. ఎందుకో తెలుసా..?

by  |
సెల్‌ఫోన్‌లను చూసి జంకుతున్న రాజకీయ నేతలు.. ఎందుకో తెలుసా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : “తెల్లని దుస్తులు.. చేతిలో రెండు ఫోన్లు.. నిత్యం హలో.. హలో అంటూ సెల్​ఫోన్లలోనే చర్చలు.. ఫోన్లలో బిజీ ఉంటే రాజకీయ నేతలు ఇప్పుడు సెల్ ఫోన్​ అంటేనే జంకుతున్నారు.’’ హుజూరాబాద్​ఉప ఎన్నికలకు సంబంధించి ఏది మాట్లాడాలన్నా నేరుగానే రావాలంటూ చెప్పుతున్నారు. దీంతో హుజూరాబాద్‌లో వింత పరిస్థితి నెలకొంది. రాజకీయాల గురించి సెల్ ఫోన్లలో మాట్లాడాలంటే వణుకుతున్నారు. ఎంత ముఖ్యమైన విషయమైనా సరే ముఖాముఖీగా మాట్లాడుకుందామంటూ చెప్పుకుంటున్నారు. ప్రధాన పార్టీల నేతలు మొత్తం హుజూరాబాద్‌లో సెల్​ఫోన్లకు దూరంగా ఉన్నారు. ఎన్నికల వేళ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఫోన్లలో బిజీబిజీ ఉంటారు. తమ ప్రణాళికలు తదితర అంశాలను చర్చించుకుంటారు. ఎవరు ఎక్కడ ఉన్నారు, తమకు ఎవరు మద్దతు ఇస్తారు, వారి కోసం ఏం చేయాలనే అంశాలన్నీ ఫోన్లలోనే మాట్లాడుకుంటున్నారు. కానీ, హుజూరాబాద్‌లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా మారింది. సెల్‌లో మాట్లాడాలంటేనే నాయకులు హడలిపోతున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ముఖ్య నేతలు ఫోన్లను వాడటమే మానేశారు.

రికార్డు చేసి రేట్ పెంచుకుంటున్నారట..

తమకు మద్దతు ఇవ్వాలంటూ ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలను బతిమిలాడుకోవడం సాధారణమే. కానీ, హుజూరాబాద్​బై ఎలక్షన్‌లో మాత్రం లీడర్ల కొనుగోళ్లు తీవ్రంగా మారాయి. చాలా మేరకు పార్టీ నేతలను లక్షలు పోసి కొనుక్కున్నట్టు ప్రచారంలో ఉంది. అయితే కొంతమంది బుడ్డ లీడర్లు తమతో పార్టీ పెద్దలు మాట్లాడిన వాయిస్‌ను రికార్డు చేసి మరో చోట రేటును పెంచుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

అంతేకాకుండా తమ ఎన్నికల వ్యూహం ప్రత్యర్థులకు తెలియకుండా ఉండేందుకు గతంలో సెల్​ ఫోన్లనే ఎక్కువగా వాడేవారు. కానీ ఇప్పుడు నేతలు మాట్లాడిన మాటలన్నీ నిమిషాల్లనే బయటకు వస్తున్నాయి. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లోపరిస్థితి భిన్నంగా సాగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేసేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వాడుకుంటున్నా.. సెల్​ఫోన్లను మాత్రం పక్కన పెట్టారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తూ తమ సీక్రెట్​లను వింటున్నారని ఆరోపణలు కూడా విన్పించాయి.

ఇక పార్టీల అభ్యర్థులైతే తమ ఫోన్లకు తాళాలు వేసుకున్నారు. మంత్రివర్గం నుంచి బయటకు పంపిన నాటి నుంచే ఈటల రాజేందర్​ఫోన్ అస్సలు వినియోగించడం లేదు. ఏదైనా ముఖాముఖిగా మాత్రమే మాట్లాడుతున్నారు. వాట్సాప్ కాల్, ఐఫోన్​లో ఉండే ఫేస్​యాప్‌లను తొలుత ఉపయోగించినా ఇప్పుడు మాత్రం అసలు ఫోన్ జోలికే వెళ్లడం లేదని పార్టీ నేతలు చెప్పుతున్నారు. అయితే ఆయా పార్టీల ముఖ్య నేతలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్లలో మాట్లాడుతున్నా.. కేవలం బహిరంగ విషయాలు మాత్రమే ఫోన్లలో మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మండలాల ఇన్‌చార్జీలు కూడా ఫోన్లలో మాట్లాడం లేదు. ఏ సమాచారం ఇవ్వాలనుకున్నా.. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. అమాత్యులు దాదాపుగా ఒకరిద్దరు సన్నిహిత సిబ్బంది, పీఆర్వోలకే వివరాలు చెప్పేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప హలో అనడానికే ఆలోచించే పరిస్థితి నెలకొంది.

కౌశిక్​ వ్యవహారంతో మరింత భయం..

హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు వస్తాయనే నేపథ్యంలోనే టీఆర్ఎస్​నేత కౌశిక్​రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఇది రాష్ట్రమంతా చర్చగా మారింది. కాంగ్రెస్‌లో ఉంటూనే టీఆర్‌ఎస్‌కు కోవర్టుగా మారినట్లు రూఢీ అయింది. యూత్​నేతలతో మాట్లాడిన ఆడియోలు సంచలనంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ఫోన్లకు దాదాపుగా దూరమయ్యారు. ఈ ఎన్నికల తర్వాతే ఫోన్లలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.



Next Story