ఒక్కసారిగా సైలెంట్‌ అయిన కేసీఆర్ ఫ్యామిలీ.. పరేషాన్‌లో గులాబీ పార్టీ లీడర్లు!

by Disha Web Desk 2 |
ఒక్కసారిగా సైలెంట్‌ అయిన కేసీఆర్ ఫ్యామిలీ.. పరేషాన్‌లో గులాబీ పార్టీ లీడర్లు!
X

హైదరాబాద్ పర్యటనలో పీఎం మోడీ రాష్ట్ర ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. ఈ విమర్శలను సీఎం ఫ్యామిలీ మెంబర్స్ తిప్పి కొడతారనుకొని బీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. కానీ కేటీఆర్, కవిత అసలు రెస్పాండ్ కాకపోగా, మంత్రి హరీశ్ రావు ట్వీట్‌కే పరిమితమయ్యారు. మంత్రులు మాత్రం పోటీపడి మరీ ప్రెస్ మీట్లు పెట్టి ప్రధాని వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. అయితే సీఎం ఫ్యామిలీ సైలెంట్‌గా ఉండిపోవడం బీఆర్ఎస్ శ్రేణులకు మింగుడుపడడం లేదు. మౌనం వెనక మతలబు ఏమై ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు వచ్చిన పీఎం మోడీ ఎలాంటి కామెంట్లు చేస్తారోనని గులాబీ నేతలు ఉత్కంఠగా ఎదురుచూశారు. దానికి కౌంటర్ ఇవ్వడానికి కాచుకుని కూర్చున్నారు. తీరా ప్రధాని రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తున్నదని, అవినీతి రాజ్యమేలుతున్నదని, అన్ని వ్యవస్థలపై ఆ కుటుంబానిదే పెత్తనమని, ప్రతిదాంట్లో వారి స్వార్థం కోసమే ప్రయత్నిస్తున్నారని.. కామెంట్లు చేయడంతో విస్తుపోయారు.

‘ఫ్యామిలీ’ సైలెంట్

ప్రధాని చేసిన ఆరోపణలకు, కామెంట్లకు స్పందించకుండా సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత, మేనల్లుడు హరీశ్‌రావు మాత్రం మీడియాకు దూరంగానే ఉండిపోయారు. హరీశ్‌రావు మాత్రం ట్వీట్ ద్వారా ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ప్రధానిపై గత కొన్ని రోజులుగా ఓపెన్ లెటర్లు, ట్వీట్ల ద్వారా యుద్ధం ప్రకటించిన కేటీఆర్.. తీరా పీఎం ఇక్కడికి వచ్చి ఘాటు వ్యాఖ్యలు చేసిన తర్వాత మాత్రం ఊహకందని రీతిలో మౌనవ్రతం పాటించారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్... ప్రధాని ఘాటుగా విమర్శించినా సైలెంట్‌గా ఉండిపోవడం పార్టీ నేతలకే మింగుడు పడలేదు. మౌనమే ఉత్తమం అనే తీరులో నో రెస్పాన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

వ్యూహాత్మకమా!

కేసీఆర్ కుటుంబాన్ని ప్రధాని టార్గెట్ చేసి కామెంట్లు చేస్తే ఆ ఫ్యామిలీ మొత్తం సైలెంట్‌గా ఉండిపోవడం వెనక మతలబు పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఇది వ్యూహాత్మక మౌనమా.. లేక స్పందిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనే ఆందోళనా?.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా?.. అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు మంత్రులు ప్రెస్ మీట్స్ పెట్టి కౌంటర్ ఇవ్వగా, ఇంకొందరు ప్రెస్ నోట్స్ విడుదల చేశారు. ఫ్యామిలీ మొత్తం సైలెంట్‌గా ఉండిపోయి రాష్ట్ర నేతలకు, మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పడం గురించి రకరకాలుగా చర్చించుకున్నారు. మోడీ తాజా విమర్శలతో భవిష్యత్తులో బీజేపీ మరింతగా దూకుడు పెంచుతుందేమోననే మాటలు గులాబీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మంత్రి హరీశ్ రావు మాత్రం కుటంబ పాలన విషయాన్ని ప్రస్తావించకుండా ప్రధాని లేవనెత్తిన అంశాల్లోని ఇతరాలపై స్పందించారు. విభజన హామీలపై ప్రధానిని నిలదీశారు.

మోడీ బహిరంగ సభపై కేసీఆర్ ఆరా

ప్రధాని మోడీ టూర్‌కు దూరంగా ఉన్న సీఎం కేసీఆర్ రోజంతా ప్రగతిభవన్‌లోనే గడిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రధాని ప్రోగ్రామ్‌పై ఆరా తీసినట్లు తెలిసింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభను స్వయంగా చూసినట్లు సన్నిహితులు పేర్కొన్నారు. సభకు ఎంత మంది హాజరయ్యారు?.. వచ్చినవారిలో పార్టీ కార్యకర్తలెంతమంది? ప్రజల భాగస్వామ్యమేంటి? స్వచ్ఛందంగానే వచ్చారా? స్థానికంగా ఉన్న బీజేపీ లీడర్లు తరలించారా? తదితరాలపై ప్రగతిభవన్ వర్గాలు ఆరా తీసి కేసీఆర్‌కు సమాచారం అందించాయి. మోడీ ప్రసంగం మొత్తాన్ని సీఎం కేసీఆర్ టీవీలో స్వయంగా చూసి, ఆ విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఏ తీరులో ఇవ్వాలో మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పి తగిన డైరెక్షన్ ఇచ్చినట్టు ఆ వర్గాల ద్వారా తెలిసింది.


Next Story

Most Viewed