సొంత గూటికి మాజీ మంత్రి... వద్దు బాబోయ్ అంటున్న టీడీపీ క్యాడర్!!

by Disha Web Desk 1 |
సొంత గూటికి మాజీ మంత్రి... వద్దు బాబోయ్ అంటున్న టీడీపీ క్యాడర్!!
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించడానికి ఆరాటపడుతోన్న బీజేపీకి ఏపీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు కమలం కండువా తీసేశారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పారు. మోడీపై అభిమానం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల పార్టీని వీడుతున్నానంటూ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు రావెల. కాగా టీడీపీ ప్రభుత్వంలో మూడేళ్లపాటు మంత్రిగా పని చేసిన ఆయన తిరిగి సొంత గూటికి చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సన్నిహితులతో కలిసి పావులు కదుపుతున్నట్టు సమాచారం.



సివిల్స్ రాసి IRTS కు ఎంపికైన రావెల కిషోర్ బాబు.. వివిధ ప్రభుత్వ శాఖల్లో సీనియర్ లెవెల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, టీడీపీ తరపున గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరితపై గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్ లో మూడేళ్లపాటు మంత్రిగా కొనసాగారు. పనితీరు సరిగా లేదన్న అభియోగాలు రావడంతో చంద్రబాబు ఆయన్ను తప్పించి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబుకు ఆ బాధ్యతలు అప్పగించారు. దీంతో హర్ట్ అయిన రావెల జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకుని ప్రత్తిపాడు నుండి 2019 ఎన్నికల బరిలో నిలిచారు. వైసీపీ సునామీలో రావెల కొట్టుకుపోయారు. మేకతోటి సుచరిత చేతిలో ఘోర పరాభవం చవిచూడాల్సి వచ్చింది.



ఆ ఓటమి అనంతరం జనసేన పార్టీని వీడిన రావెల.. కన్నా లక్ష్మీ నారాయణ అధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే ప్రధాని మోడీ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. రాష్ట్రంలో బీజేపీ బలహీనంగా ఉండడంతో తన రాజకీయ భవిష్యత్తుపై రావెల కిషోర్ బాబు డైలమాలో పడినట్టు తెలుస్తోంది. అందుకే గత 6 నెలలుగా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారనేది సన్నిహితవర్గాల సమాచారం. మరి పార్టీని వీడితే ఆయనకి ఉన్నది రెండే ఆప్షన్స్. జనసేన పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో వైసీపీ లేదా టీడీపీ లోనే చేరాలి. ప్రత్తిపాడు నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంటున్న ఆయనకు వైసీపీ నుండి టికెట్ దక్కే అవకాశం కూడా లేదు. సెకండ్ టర్మ్ కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో అలకబూనిన సుచరితకు ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్ నీకే అంటూ అధిష్టానం హామీ ఇచ్చి బుజ్జగించినట్టు టాక్. ఇక ఆ సైడ్ చూసే అవకాశం కూడా లేకుండా పోయింది రావెలకు.

ఇక మిగిలింది సొంత గూడు టీడీపీ ఒక్కటే. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి సుచరితపై స్వల్ప తేడాతో ఓటమి పాలైన డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా వైసీపీలో చేరారు. దీంతో అక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి కరువయ్యారు. ప్రస్తుతం మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యకు నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ ఎన్నికల బరిలో దింపేందుకు సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తూనే ఉంది టీడీపీ అధిష్టానం. ఇదే అదునుగా భావించిన రావెల కిషోర్ బాబు పాత దోస్తులతో కలిసి పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈ వార్తలకి బలం చేకూరుస్తున్నట్టే ఉంది ఆయన వ్యవహారశైలి కూడా.



జిల్లాకి చెందిన టీడీపీ నేతలతో కలిసి చెట్టాపట్టాలేసుకుని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబును కూడా కలిశారు. ఇక రాజధాని రైతులు ప్రత్తిపాడు మీదుగా పాదయాత్ర నిర్వహించగా... టీడీపీ నేతలతో కలిసి యాత్ర ప్రారంభం నుండి ముగిసేవరకు వారితో కలిసి నడిచారు. అంతేకాదు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మరికొందరు జిల్లా నేతలను కలిసి తాను తిరిగి టీడీపీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఆయన రాకను మాత్రం లోకల్ క్యాడర్ వ్యతిరేకిస్తోందట. రాజకీయాల్లోకి తీసుకొచ్చి, ఎమ్మెల్యే సీటు ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చిన పార్టీపై కృతజ్ఞత కూడా చూపకుండా వీడటంపై గుర్రుగా ఉన్నారట. ఐదేళ్లలోనే 3 పార్టీలు మారి, ఏ దారి లేకపోవడంతోనే మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారంటూ ఆగ్రహిస్తున్నారంట తెలుగు తమ్ముళ్లు. మరి ఆయన రాకను ప్రత్తిపాడు టీడీపీ సోదరులు ఎంతవరకు ఆమోదిస్తారో, సహకరిస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed