ఇది భారత సమయమని ప్రపంచమే చెబుతోంది.. ప్రధాని మోడీ

by Disha Web |
ఇది భారత సమయమని ప్రపంచమే చెబుతోంది.. ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచమంతా ఇది భారత్ సమయమని చెబుతోందని అన్నారు. దేశం నుంచి దొంగలించిన వస్తువులను తిరిగి భారత్ ఇవ్వాలని ఇతర దేశాల పోటీ నెలకొందని అన్నారు. ఇది భారత్ విలువను సూచిస్తుందని చెప్పారు. శనివారం ఇండియా టుడే సదస్సు 2023లో ఆయన మాట్లాడారు. గత 75 రోజులలో మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ రంగాలలో జరిగిన అద్భుతమైన పరిణామాలు ఇది భారత్ మూమెంట్ ని గర్వంగా చూపిస్తున్నాయని ప్రధాని అన్నారు. ఈ ఏడాది 75 రోజుల్లో సాధించిన విజయాల జాబితా చాలా పెద్దగా ఉందని చెప్పారు.

వీటిలో భారత్ చారిత్రాత్మక గ్రీన్ బడ్జెట్‌ను సాధించిందని.. కర్ణాటక శివమొగ్గలో కొత్త విమానశ్రయం ప్రారంభించామని చెప్పారు. అంతేకాకుండా ముంబై మెట్రో రైలు ప్రారంభం, ఎంవీ గంగా విలాస్ నదీ పర్యటన, బెంగళూరు-మైసూరు ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు ప్రారంభం, అండర్-19 మహిళలు టీ20 వరల్డ్ కప్ జయకేతనం, రెండు అస్కార్ అవార్డులు వంటి మైలు రాళ్లను భారత్ అందుకుందని చెప్పారు.

ఈశాన్యంలో కేంద్రమంత్రులు

తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. దశాబ్దాలుగా సరిహద్దుల్లోని గ్రామాలు చివరిగా పరిగణిస్తే.. మేము మాత్రం దేశ మొదటి గ్రామాలుగా గుర్తించామని చెప్పారు. అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మంత్రులు ప్రస్తుతం ఈశాన్యంలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారని అన్నారు. తాను ప్రధాని అయ్యాక 50 సార్లకు పైగా ఈశాన్యంలో పర్యటించానని పేర్కొన్నారు. కేవలం రాజధానికి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ పర్యటనలు చేస్తున్నారని చెప్పారు. తమను జాగ్రత్తగా చూసుకునే ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం సంతృప్తి కరంగా ఉందని అన్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. భారత ప్రజాస్వామ్యం, సంస్థలు విజయవంతమవడం కొందరిని బాధిస్తున్నదని అన్నారు. దేశం పురోగతిలో దూసుకెళ్తున్న సమయంలో కొందరు కావాలనే మసి పూస్తున్నారని దుయ్యబట్టారు. దేశం స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా, మొబైల్ తయారీలో రెండో స్థానంలో, స్టార్టప్ ఎకోసిస్టమ్ లో మూడో స్థానంలో ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందని చెప్పారు. అవినీతిపై నిరసనల నుంచి అవినీతికి మద్దతుగా నిరసనలు చేస్తున్నారని ప్రతిపక్షాలకు చురకలంటించారు.
Next Story