తెలంగాణలో కేసీఆర్ మరో భారీ కుంభకోణం: మాజీ మంత్రి నాగం

by Disha Web Desk 11 |
తెలంగాణలో  కేసీఆర్ మరో భారీ కుంభకోణం: మాజీ మంత్రి నాగం
X

దిశ ప్రతినిధి, నాగర్ కర్నూల్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కుంభకోణాల్లో మరో భారీ కుంభకోణం వెలుగు చూస్తోందని మాజీమంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మాట్లాడిన అంశాలను తీవ్రంగా ఖండిస్తూ మాట్లాడారు. ఇప్పటికే ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, భూ కుంభకోణాలతో పాటు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాలలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు ఒక్కో భవనం 125 వేల చదరపు అడుగుల స్థలంలో మూడంతస్తుల బిల్డింగ్ నిర్మాణానికి రూ. 53 కోట్ల నుంచి 62 కోట్లకు పెంచి వెచ్చించారని, ఈ లెక్కన ఒక స్క్వేర్ ఫీట్ 4,240 ధర అవుతుందన్నారు.

కాగా ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక హంగులు, కార్పొరేట్ స్థాయిలో నిర్మించే భవనాలకు సైతం ఒక స్క్వేర్ ఫీట్ 1,800 మించి కావడం లేదన్నారు. ఈ లెక్కన 30 కోట్లు కూడా కావడంలేదని మిగతా 30 కోట్ల నిధులు ఎవరికి ఖర్చు చేశారో చెప్పాలన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా నిర్మించే భవనాల్లో భారీగా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. నూతన కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయ భవనాల ప్రారంభోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలేనని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు 7.17 టీఎంసీలు మాత్రమే డ్రా చేయాలని చెబుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఉద్దండపూర్ వరకు ఐదు ప్యాకేజీలలో నీటిని నింపుతామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మతి తప్పిన విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టు ఆపమన్నది మీ పార్టీ నాయకుడేనని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1200 మంది ఉద్యమకారులు అమరులైనప్పుడు కంటనీరు రాలేదా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తూ సిపిడబ్ల్యూ స్కీం ద్వారా సిద్ధిపేటకు నీళ్లు ఇచ్చింది నేనే అంటూ గుర్తు చేశారు. రామన్ పాడు ద్వారా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చిన ఘనత తనకే దక్కిందని పేర్కొన్నారు.

Next Story