మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే హక్కు లేదు: కూనంనేని

by Disha Web Desk 2 |
మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే హక్కు లేదు: కూనంనేని
X

దిశ, తెలంగాణ బ్యూరో: విభజన హామీలు అమలు చేయని ప్రధాని మోడీ తెలంగాణలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసిన మోడీ తొమ్మిదేళ్లలో ఏ ఒక్క పని కూడా చేయలేదని ఆరోపించారు. ప్రధాని వందే భారత్‌ రైల్‌ ప్రారంభం కోసం 8వ తేదీన హైదరాబాద్‌ పర్యటనను నిరసిస్తూ ఏప్రిల్‌ 8న రాష్ట్రంలోని అన్ని అంబేద్కర్‌ విగ్రహాల వద్ద నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా, గిరిజన విశ్వవిద్యాలయం లాంటి రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధానికి తెలంగాణలో అడుగు పెట్టే నైతిక హక్కు లేదన్నారు.

తెలంగాణకు గుండెకాయ అయినటువంటి సింగరేణిలోని సత్తుపల్లి, ఇల్లందులోని కోయగూడెం, మందమర్రిలోని రెండు గనులను మొత్తం నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరణకు గతంలో టెండర్లు పిలవడం జరిగిందని గుర్తుచేశారు. ఒక గని ఇప్పటికే ప్రైవేటీకరణ చేశారని తెలిపారు. మిగిలిన మూడు గనులకు ఎవరూ టెండర్‌ వేయకపోవడంతో మూడు రోజుల క్రితం మరల టెండర్లు పిలువడం జరిగిందన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభానికి వచ్చిన ప్రధాని సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని, 51 శాతం సింగరేణిది ఉన్నదని చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశారని విమర్శించారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి అబద్ధాలు ఆడటం ఆ పదానికి వన్నె తీసుకరాదని విమర్శించారు. కార్మికులు కొట్లాడి తెచ్చుకున్న హక్కులను నేడు మోడీ కార్మికుల హక్కులను కాలరాస్తున్నాడన్నారు. సీబీఐ, ఈడీలను ప్రతిపక్షాల కొరకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ తరణంలో నరేంద్రమోడీ హైదరాబాద్‌ పర్యటనను వ్యతిరేకించాలని కోరుతున్నాను.



Next Story