కనికరించని ఖాకీలు… వలస కూలీలపై లాఠీల ప్రతాపం

by  |
కనికరించని ఖాకీలు… వలస కూలీలపై లాఠీల ప్రతాపం
X

దిశ ఏపీ బ్యూరో: లాక్‌డౌన్ దారీతెన్ను తెలియడం లేదు. రెండు నెలలుగా పనులు లేవు. ఊరుకాని ఊరు.. జీవనమెలాగో తెలియడం లేదు. ఉన్నదాంట్లో తిని బతికే జీవులు. చేతులు చాచేందుకు మనస్సాక్షి అంగీకరించడం లేదు. దాతలు పెట్టిన తిండి తింటూ ఎన్నాళ్లని ఉండేది అనుకుంటూ.. కాలినడకన బయల్దేరుతున్నారు.

ప్రభుత్వం ఏం చెబుతుందో తెలియదు. ప్రభుత్వాలు చెప్పే పోర్టళ్లలో ఎలా అప్లికేషన్ పెట్టాలో తెలియదు. వారంత భవన నిర్మాణ కూలీలు. సైకిళ్లు కొనుక్కుని స్వస్థలాలకు పయనమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలో నడుస్తున్న వలస కూలీలను ఆ దిశలో వెళ్తున్న సీఎస్ నీలం సాహ్నీ చూశారు. కారు ఆపి ఎక్కడికి వెళ్తున్నారని ఆరాతీశారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వలస కూలీలని గుర్తించారు. వారందర్నీ పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారి ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

సీఎస్ ఆదేశాలతో వారందర్నీ అధికారులు తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు. ఈ ఉదయం వారందరికీ అల్పాహారం పంపిణీ చేశారు. ఈ క్రమంలో సైకిళ్లపై వచ్చిన దాదాపు 150 మంది కూలీలు టిఫిన్ చేసి తిరుగుముఖం పట్టారు. వీరంతా విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు వారిని చూసి అడ్డుకుని గుంపులుగా ఎటెళ్తున్నారని అడిగారు. స్వస్థలాలకు వెళ్తున్నామని చెప్పారు. వారిని పునరావాసకేంద్రాలకు తరలించే ప్రయత్నం చేయగా, మాటామాట పెరిగింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కూలీలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. అనంతరం వారిందరినీ పట్టుకుని తిరిగి విజయవాడ క్లబ్‌కు తరలించారు.

Next Story

Most Viewed